Share News

కలవరం!

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:58 AM

సాగునీటి కాల్వలు, డ్రెయునేజీల్లో ఏటా చేపట్టే మరమ్మతు పనులకు నిధుల విడుదలపై సాగునీటి సంఘాల అధ్యక్షులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుండా పోతుందని అంటున్నారు. గతేడాది నియోజకవర్గానికి రూ.2 కోట్లు మంజూరు చేశారని, ఈ ఏడాది అంతేనంటూ సంకేతాలు వస్తున్నాయని చెబుతున్నారు. నీటి తీరువా నగదునే దీనికి కేటాయిస్తారని, జిల్లాలో వసూళ్లేమో మందకోడిగా సాగుతున్నాయని కలవరం వ్యక్తం చేస్తున్నారు.

కలవరం!

- జిల్లాలో మరమ్మతులకు నోచుకోని కాల్వలు

- గతేడాది నియోజకవర్గానికి రూ.2 కోట్లు మంజూరు

- ఈ ఏడాది అంతేనంటూ సంకేతాలు

- నీటి తీరువా నగదే ఓఅండ్‌ఎం పనులకు కేటాయించే అవకాశం

- మందకోడిగా సాగుతున్న వసూళ్లు

- నిధుల మంజూరుపై సాగు నీటి సంఘాల అధ్యక్షుల ఆందోళన

సాగునీటి కాల్వలు, డ్రెయునేజీల్లో ఏటా చేపట్టే మరమ్మతు పనులకు నిధుల విడుదలపై సాగునీటి సంఘాల అధ్యక్షులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుండా పోతుందని అంటున్నారు. గతేడాది నియోజకవర్గానికి రూ.2 కోట్లు మంజూరు చేశారని, ఈ ఏడాది అంతేనంటూ సంకేతాలు వస్తున్నాయని చెబుతున్నారు. నీటి తీరువా నగదునే దీనికి కేటాయిస్తారని, జిల్లాలో వసూళ్లేమో మందకోడిగా సాగుతున్నాయని కలవరం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలోని సాగునీటి కాల్వలు, డ్రెయునేజీల్లో ఈ ఏడాది వేసవిలో చేపట్టాల్సిన పనులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి పారుదల, డ్రెయునేజీ విభాగం అధికారులు కాల్వల మరమ్మతు పనులకు (ఓఅండ్‌ఎం) సంబంధించిన అంచనాలు తయారు చేసి పంపినా, ఎంతవరకు నిధులు విడుదల అవుతాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. గతేడాది నియోజకవర్గానికి ఓఅండ్‌ఎం పనుల నిమిత్తం రూ.2 కోట్లు మాత్రమే మంజూరు చేశారని, ఈ ఏడాది అదే పద్ధతి కొనసాగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయని నీటిసంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓఅండ్‌ఎం పనులకు సంబంధించి పంపిన ప్రతిపాదనలు ఎప్పటికి ఆమోదం పొందుతాయి, ఎప్పటికి పనులు ప్రారంభిస్తారనే అంశంపై సందిగ్థత నెలకొంది. నీటి తీరువా వసూళ్ల ద్వారా వచ్చిన నగదును ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో ఓఅండ్‌ఎం పనులకు కేటాయిస్తారు. నీటి తీరువా వసూళ్లు మందకోడిగా సాగుతుండటంతో ఈ ఏడాది కాల్వల్లో ఓఅండ్‌ఎం పనులకు సరిపడా నిధులు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నీటి విడుదల నిలిపివేత

ఖరీఫ్‌ సీజన్‌లో శివారు ప్రాంతాల్లో ఆలస్యంగా సాగు చేసిన వరి పంటను కాపాడేందుకు, వేసవిలో తీర ప్రాంతంలోని 376 తాగునీటి చెరువులను నింపేందుకు శివరాత్రి వరకు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేశారు. కాల్వలకు నీటి విడుదలను నిలిపివేస్తేనే వేసవి కాలంలో కాల్వల్లో మరమ్మతు పనులు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇటీవల కలెక్టర్‌ నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కాల్వల మరమ్మతు పనులు చేసేందుకు అంచనాలు తయారు చేసి త్వరితగతిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

సాగు నీటి సంఘాల ద్వారా ప్రతిపాదనలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలు మనుగడలోకి వచ్చాయి. వీటి పర్యవేక్షణలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కృష్ణాడెల్టాలో సాగునీటి కాల్వలు, డ్రెయినేజీల మరమ్మతు పనులు పూర్తిస్థాయిలో చేయాలనే ఉద్దేశంతో పనులకు అంచనాలు రూపొందించారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో సాగునీటి సంఘాల అధ్యక్షులు కాల్వల పనులకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. మరికొన్ని పనులకు సంబంధించి అంచనాలు రూపొందిస్తున్నారు. దివిసీమ ప్రాంతానికి సాగు నీటిని సరఫరా చేసే కేఈబీ కాల్వ పరిధిలో 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగునీరు సక్రమంగా అందించేందుకు, డ్రెయినేజీలకు మరమ్మతులు చేసేందుకు 115 పనులను రూ.30 కోట్ల అంచనాలతో రూపొందించారు. ఇందులో శివారు ప్రాంతాలకు సాగు నీటిని సరఫరా చేసే 9వ నెంబరు ప్రధాన కాల్వ, అనుబంధ కాల్వల్లో పనులు చేసేందుకు రూ.3కోట్లతో అంచనాలను ప్రతిపాదించారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని నార్త్‌ మండల పరిధిలోని కాల్వల మరమ్మతు పనుల కోసం రూ.1.20 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలు ఈఈ, ఎస్‌ఈలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి చేరతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కేఈబీ, బందరు, రైవస్‌ కాల్వ, రామరాజుపాలెం కాల్వ, బంటుమిల్లి కాల్వల ద్వారా సాగునీటి విడుదల జరుగుతుంది. ప్రధాన కాల్వలు, డ్రెయినేజీలలో ఓఅండ్‌ఎం పనులు చేసేందుకైనా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని రైతులు, సాగు నీటి సంఘాల అధ్యక్షులు కోరుతున్నారు.

అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ల ఊసేది?

అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక మండలాల్లో ఏడు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు పూర్తిగా పాడైపోయాయి. వీటి మరమ్మతుల కోసం గతంలో రూ.38 కోట్లతో అంచనాలు రూపొందించారు. గతేడాది సంభవించిన మొంథా, దిత్వా తుఫానుల కారణంగా తీర ప్రాంతంలోని మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కోడూరు వచ్చిన సమయంలో అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లకు కనీస మరమ్మతులు చేయించాలని దివిసీమ ప్రాంత రైతులు కోరారు. దీంతో సాంకేతిక నిపుణులు ఈ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లను పరిశీలించారు. అయినా ఈ ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోవడం లేదు. మచిలీపట్నం సౌత మండలంలోని కొత్తపల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాల వద్ద ఉన్న రెండు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు పాడైపోయాయి వీటికి కనీస మరమ్మతులు చేసే అంశంపై అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు తయారు చేయలేదు. తాజాగా మచిలీపట్నం నియోజవర్గం పరిధిలోని డ్రెయినేజీలలో పూడికతీత, ఇతరత్రాలకు సంబంధించి 74 పనులు చేసేందుకు రూ.13.24కోట్లతో, కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ పరిధిలో 27 పనులను రూ.18.50 కోట్ల అంచనాలతో చేయాలని అధికారులు ప్రతిపాదనలు చేసి పంపారు. ఈ పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటిని విడుదల చేసే జూన్‌, జూలై నెలల్లోగా ఈ పనులు పూర్తి చేస్తేనే ఉపయోగం ఉంటుందని రైతులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు అంటున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:58 AM