లాభాల కొండపై నష్టాల బండ!
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:16 AM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 19 సేల్స్ ఎంపోరియం(సేల్స్ అవుట్ లెట్స్)లతో ఆది నుంచీ లాభాలతో నడుస్తోంది.
ఆప్కోలోకి ఎమ్మిగనూరు చేనేత సొసైటీ?
అవుట్‌లెట్ల విలీనానికి సన్నాహాలు
చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఆదేశాలు
31న సమావేశంలో తుది నిర్ణయం
ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆప్కో
విలీనంపై చేనేత సంఘాల ఆందోళన
మునిగిపోతున్న పడవను కాపాడాలనుకోవడం సహజం. కానీ.. మునిగిపోయే పడవే.. సజావుగా ప్రయాణిస్తున్న మరో పడవను ముంచేయాలనుకుంటే ఏమనాలి?!.. 88 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి కూడా ఇప్పుడు ఇలాంటి కష్టమే ఎదురైంది! లాభాల్లో ఉన్న ఈ సొసైటీని.. ఇప్పటికే నిండా నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆప్కో తనలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే వందలాది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సొసైటీ పూర్తిగా తన అస్తిత్వం కోల్పోక తప్పదు. దీనిపై ఆధారపడి ఉన్న కార్మిక కుటుంబాలు రోడ్డున పడకతప్పదు!
(కర్నూలు-ఆంధ్రజ్యోతి)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 19 సేల్స్ ఎంపోరియం(సేల్స్ అవుట్ లెట్స్)లతో ఆది నుంచీ లాభాలతో నడుస్తోంది. అలాంటి ఈ సొసైటీని ఆప్కోలో విలీనం చేసేందుకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. విలీనంపై సభ్యుల ఆమోదం కోసం ఈనెల 31న జరిగే సర్వసభ్య సమావేశపు అజెండాలో చేర్చినట్లు తెలిసి చేనేత కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఇదీ చరిత్ర..
కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఎమ్మిగనూరు ఒకటి. పేదరికం, నిరుద్యోగం, కరువు, ఆకలి మరణాలతో అల్లాడిపోతున్న సమయంలో చేనేత కార్మికులకు ఉపాధి చూపించి ఆకలి తీర్చాలనే సంకల్పంతో పద్మశ్రీ మాచాని సోమప్ప.. స్వాతంత్ర్యానికి పూర్వమే.. 1938లో ‘ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్’ను స్థాపించారు. దీంతో చేనేతలకు జీవనోపాధి లభించింది. నేతన్నలు పోగూ పోగూ వడికి.. సహజమైన రంగులద్ది.. విభిన్నమైన డిజైన్లు తీసుకురావడంతో దేశంలోనే అత్యుత్తమ చేనేత వస్త్ర ఉత్పత్తి బ్రాండ్‌గా మారింది. చేనేతపురిగా ప్రసిద్ధి చెందింది. దేశంలో మరమగ్గాల విప్లవానికి ఎన్నో చేనేత సంఘాలు కనుమరుగైనా.. ఆ పోటీని దీటుగా ఎదుర్కొంటూ 450 మందికిపైగా నేతన్నలకు ఉపాధిచూపుతోంది. ఎమ్మిగనూరు చేనేత వస్ర్తాలకు జియోగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం ‘రిజల్యూట్ బీ2బీ’ సంస్థ కూడా కృషి చేస్తోంది. సొసైటీకి ఉన్న కోట్లాది ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు చేస్తున్నారని, దీని వెనుక రాజకీయ నాయకుల హస్తముందని ఆరోపిస్తున్నారు.
విలీన నిర్ణయం ఉపసంహరించుకోవాలి
ఎమ్మిగనూరు చేనేత మగ్గంపై ఆధారపడి 50 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాను. పోగుపోగు వడికితేనే మా జీవితాలు ముందుకు సాగుతాయి. ఈ రోజు సేల్స్ ఎంపోరియంలు విలీనం చేస్తామంటారు. ఇంకో రోజు సొసైటీనే విలీనం చేస్తామంటే మేమెక్కడికి వెళ్లాలి. నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలి.
- పబ్బతి నాగరాజు, మాజీ డైరెక్టర్, ఎమ్మిగనూరు చేనేత సహకారం సంఘం