దిగుబడిపై దిగులు
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:24 AM
పసుపు రైతులను ఈ ఏడాది కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది చివర్లో వచ్చిన మొంథా తుఫాను ప్రభావంతో కొంతమేర పంట దెబ్బతినగా, మిగిలిన పంటను రైతులు మరికొంత వెచ్చించి కాపాడుకున్నారు. పంట కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం తవ్వి తీస్తున్నారు. పంట దిగుబడి బాగా తగ్గిపోవడం, వచ్చిన దిగుబడి కూడా నాణ్యత లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
- పసుపు సాగుపై మొంథా తుఫాను ప్రభావం
- భారీగా తగ్గిపోయిన దిగుబడులు
- నాణ్యత లేక పడిపోయిన ధరలు
- ఐదు నెలలు గడిచినా అందని తుఫాను సాయం
- ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల వేడుకోలు
పసుపు రైతులను ఈ ఏడాది కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది చివర్లో వచ్చిన మొంథా తుఫాను ప్రభావంతో కొంతమేర పంట దెబ్బతినగా, మిగిలిన పంటను రైతులు మరికొంత వెచ్చించి కాపాడుకున్నారు. పంట కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం తవ్వి తీస్తున్నారు. పంట దిగుబడి బాగా తగ్గిపోవడం, వచ్చిన దిగుబడి కూడా నాణ్యత లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మోపిదేవి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):
కూరగాయలు, వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగాంచిన దివిసీమలోని లంక గ్రామాలు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పసుపు పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవటం, గిట్టుబాటు ధర లేకపోవటంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మండలాలు కలిపి అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో 305 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నారు. 2025, అక్టోబరు చివరిలో వచ్చిన మొంథా తుఫాను కారణంగా పసుపు పంట తీవ్రంగా దెబ్బతింది. నాడు బలమైన ఈదురు గాలులు వీచగా, పసుపు మొక్కల కుదుళ్లు కదిలిపోయి దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే పంట నష్టం అంచనాలు రూపొందించి రైతులను అన్నివిధాల ఆదుకుంటామని చెప్పగా, అప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి సాగు చేసిన పంటను అదనంగా మరి కొంత వెచ్చించి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పంటను తవ్వి తీయగా, సగానికిపైగా దిగుబడులు తగ్గిపోయాయి.
భారీగా తగ్గిన దిగుబడులు
సాధారణంగా పసుపు పంట సాగు చేసిన సమయంలో ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తుఫాను దెబ్బకు వేళ్లు కదిలి పంట దెబ్బతినడంతో ప్రస్తుతం పది క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు 10 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రావటంతో ఆర్థికంగా తీవ్ర నష్టాలపాలయ్యామని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా సాగు చేసిన పసుపు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తే క్వింటాళ్లు ధర రూ.14 వేలు మార్కెట్‌లో పలికేదని, ప్రస్తుతం నాణ్యత తగ్గటం, యుద్ధ ప్రబావంతో రూ.9 వేలు కూడా ధర రావటం లేదు.
అందని పరిహారం
దివిసీమ ప్రాంతంలో కృష్ణానది వరదలు, తుఫానులు వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని యేటా సాగు చేయాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రభుత్వం రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించటం రైతులకు ఉపశమనం కలిగిస్తుంది. గత ఏడాది సంభవించిన తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేసిన రైతులకు ఇప్పటి వరకు ఏ విధమైన పరిహారం అందించలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలోగాని, రైతులు పంటకు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం ద్వారా నష్టాన్ని అంచనా వేసి అందించాల్సిందిగా రైతులు కోరుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటమే లక్ష్యంగా చెబుతున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం తుఫాను కారణంగా దెబ్బతిని తీవ్ర నష్టాల పాలైన పసుపు రైతులకు బీమా చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంతలా దిగుబడి ఎన్నడూ తగ్గలేదు
మూడు ఎకరాల్లో పసుపు పంట సాగు చేశా. రూ.5.50 లక్షలు పెట్టుబడి పెట్టా. గడిచిన 20 ఏళ్లుగా వాణిజ్య, కూరగాయల పంటలు సాగు చేస్తున్నా. ఈ ఏడాది దిగుబడులు తగ్గినంతగా గతంలో ఎన్నడూ తగ్గలేదు. మొంథా తుఫాను కారణంగా వీచిన బలమైన ఈదురు గాలులకు పసుపు పంట మొక్కలు వేర్ల స్థాయి నుంచి కదిలి పంట దిగుబడులు పూర్తిగా తగ్గాయి. ఎకరాకు రూ.1100 చొప్పున ఇన్సూరెన్స్ చెల్లించా. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా పంట నష్టానికి ఇన్సూరెన్స్ వర్తింపజేసి ఆదుకోవాలి.
-బొందలపాటి వెంకటేశ్వరప్రసాద్, రైతు
ప్రభుత్వం ఆదుకోవాలి
రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పసుపు పంట సాగు చేశా. దివిసీమ ప్రాంతంలోని కృష్ణానది కరకట్ట వెంబడి ఉండటంతో వరదలు, ప్రకృతి వైపరీత్యాలకు పంటలు తరచూ గురవుతున్నాయి. తుఫాను కారణంగా పసుపు పంట దిగుబడులు దారుణంగా తగ్గాయి. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు తుఫాను నష్ట పరిహారం అందలేదు. కూటమి ఫ్రభుత్వంలో వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలోనైనా రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి.
-పరిశె రాజశేఖర్, కౌలు రైతు