Share News

Tiger Census: పక్కాగా పులుల లెక్క

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:47 AM

దేశవ్యాప్తంగా పులుల గణనకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలను ఏవిధంగా తీస్తారో, ఆ తరహాలోనే ప్రతి నాలుగేళ్లకు ఓసారి దేశంలో...

Tiger Census: పక్కాగా పులుల లెక్క

  • రేపటి నుంచే నల్లమలలో గణన ప్రక్రియ

  • నాలుగేళ్లకు ఓసారి దేశవ్యాప్తంగా లెక్కింపు

  • ‘టైగర్‌ రిజర్వు’లోనూ సిద్ధమైన అటవీ శాఖ

ఆత్మకూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పులుల గణనకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలను ఏవిధంగా తీస్తారో, ఆ తరహాలోనే ప్రతి నాలుగేళ్లకు ఓసారి దేశంలో ఉండే పులులను లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం మొదలై, మే 31వ తేదీ వరకు పులుల లెక్కలు తీయనున్నారు. మన రాష్ట్రంలోని నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ (ఎన్‌ఎ్‌సటీఆర్‌) సహా 58 పెద్దపులుల అభయారణ్యాల పరిధిలో గణన చేపట్టనున్నారు. నేషనల్‌ టైగర్స్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియను మూడు విడతలుగా చేపడతారు. ఫేస్‌-1 కింద గత ఏడాది డిసెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు అటవీశాఖ బృందాలు, తొలి మూడు రోజుల పాటు మాంసాహార జంతువులు, మరో మూడు రోజులు శాకాహార జంతువుల సంఖ్యను లెక్కించారు. అదేక్రమంలో అటవీ స్థితిగతులను పరిశీలించి వృక్ష సంపద, వేట, మానవ ప్రమేయం వల్ల కలిగిన అటవీ నష్టాల వివరాలతో పాటు పలు వన్యప్రాణుల మలమూత్రాలను, పగ్‌ మార్క్‌లను సేకరించారు. ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఎం-స్ట్రైప్స్‌ ఎకలాజికల్‌ మొబైల్‌ యాప్‌లో నిక్షిప్తపరిచారు. ఫేస్‌-2 లో శాటిలైట్‌ వ్యవస్థను ఉపయోగించి ఎన్‌టీసీఏ బృందాలు అడవుల స్థితిగతులు, వన్యప్రాణుల సంచారాన్ని పసిగట్టాయి. ఇందులో అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమేయం లేదు. ఇప్పుడు ఫేస్‌ - 3 మొదలవుతోంది. ఇందులోభాగంగా కెమెరా ట్రాప్స్‌ ఆధారంగా కేవలం పులుల ఫొటోలను సేకరించనున్నారు.


మన రాష్ట్రంలో..

నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో 3,568 చదరపు కిలోమీటర్ల మేర ‘ఎన్‌ఎ్‌సటీఆర్‌’ విస్తరించి ఉంది. ఇది దేశంలో అతిపెద్ద టైగర్‌ రిజర్వు ఫారె్‌స్టగా గుర్తింపు పొందింది. ఇంత భారీ విస్తీర్ణంలో ఒకే విడతలో పులుల కెమెరా ట్రాప్స్‌ సేకరించడం కష్టం. అందువల్ల ఎన్‌ఎ్‌సటీఆర్‌ను మూడు బ్లాకులుగా విభజించి పులుల అంచనాలను సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. బ్లాక్‌-1 కింద ఈ నెల మూడోతేదీ నుంచి ఫిబ్రవరి 10 వరకు రాజీవ్‌గాంఽధీ అభయారణ్యం పరిధిలోని ఆత్మకూరు, మార్కాపురం డివిజన్లు; బ్లాక్‌-2 కింద గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం పరిధిలోని గిద్దలూరు, నంద్యాల డివిజన్లతో పాటు ఆత్మకూరు, మార్కాపురం డివిజన్లలోని మిగిలిన ఏరియాల్లో ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్‌ 4 వరకు లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. బ్లాక్‌-3లో భాగంగా ఎన్‌ఎ్‌సటీఆర్‌ కారిడార్‌ పరిధిలో పులి సంచరించే వివిధ ప్రదేశాలను గుర్తించి అక్కడ కూడా ఏప్రిల్‌ 20 నుంచి మే 31 వరకు కెమెరా ట్రాప్స్‌ ద్వారా పులుల చిత్రాలను సేకరించనున్నారు.


ఫేస్‌ - 3 లో భాగంగా..

ఎన్‌ఎస్‌టీఆర్‌ పరిధిలోని ఆత్మకూరు, నంద్యాల, మార్కాపురం, గిద్దలూరు అటవీ డివిజన్లలో మొత్తం 18 రేంజ్‌లు, 68 సెక్షన్లు, 145 బీట్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఫేస్‌-1 ద్వారా పులుల కదలికలను గుర్తించిన ప్రదేశాలను ఎంపిక చేసి పాయింట్లను నిర్ధారిస్తారు. ఈ లెక్కన ఎన్‌ఎ్‌సటీఆర్‌ పరిధిలో మొత్తం 1,176 కెమెరా ట్రాప్‌ పాయింట్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో బ్లాక్‌-1 పరిధిలో 473, బ్లాక్‌-2 పరిధిలో 703 పాయింట్లను ఎంపిక చేశారు. గత ఏడాది డిసెంబరు 30వ తేదీ నుంచే బ్లాక్‌-1 పరిధిలో కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టారు. ఒక్కో పాయింట్లో ఎదురెదురుగా కెమెరాలు ఉండే విధంగా రెండు కెమెరా ట్రాప్స్‌ను అమర్చనున్నారు. ఇందుకోసం 40 మెగాపిక్సెల్‌ సామర్థ్యం కలిగిన కడ్డె బ్యాక్‌-సీ1, స్పార్క్‌ఆన్‌, జీసీస్‌ కంపెనీలకు చెందిన సెన్సార్‌ సిస్టమ్‌తో రూపొందించిన ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను ఒక్కొక్కటి రూ.25వేల చొప్పున కొనుగోలు చేశారు. సుమారు 2500 నుంచి 3వేల కెమెరాలను అందుబాటులో ఉంచారు. కాగా, లెక్కింపు ప్రక్రియలో నాలుగు డివిజన్ల పరిధిలో సుమారు 1,200 మంది అటవీశాఖ సిబ్బంది పాల్గొననున్నారు. కెమెరాల పనితీరు, బ్యాటరీలు, మెమరీ కార్డులు మార్చడం వంటి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఎఫ్‌ఎ్‌సవో, డీఆర్వో, ఆర్వోలు, సబ్‌ డీఎ్‌ఫవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రతిరోజూ తాము నిర్ధేశించుకున్న ప్రణాళిక ప్రకారం కెమెరా ట్రాప్స్‌ పాయింట్లను, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తారు.


పకడ్బందీగా లెక్కింపు

‘‘నాగార్జునసాగర్‌ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో పులుల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్‌ఎ్‌సటీఆర్‌ దేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వు కావడంతో మూడు బ్లాకులుగా విభజించి పులుల లెక్కింపు అంచనాల ప్రక్రియను చేపడుతున్నాం. నల్లమల అడవులే కాకుండా ఎన్‌ఎ్‌సటీఆర్‌ కారిడార్‌ పరిధిలో పులి సంచారాన్ని గుర్తించిన వివిధ ప్రదేశాల్లో కెమెరా ట్రాప్స్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే అన్ని డివిజన్ల సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చాం. అందరి సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం. ఎన్‌ఎ్‌సటీఆర్‌లో గత లెక్కలతో పోల్చితే ఈసారి పులుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం.

- విజయకుమార్‌, ఎన్‌ఎస్‌టీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌

Updated Date - Jan 02 , 2026 | 04:49 AM