Share News

బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:27 AM

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

   బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి

ధ్వజపట అవరోహణతో సకల దేవతలకు వీడ్కోలు

నేటితో ముగియనున్న శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. పదవ రోజు మంగళవారం ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు విశేష క్రతువులను వేదపండితులు జరిపించారు. స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి షోడషోపచార పూజలు చేశారు. ఈవో శ్రీనివాసరావు, చైర్మెన పోతుగుంట రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్‌ రాజకుమారి దంపతులు, జాయింట్‌ కలెక్టర్‌ కార్తిక్‌ దంపతులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దేవకీ వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మి, శ్రీదేవి, రవణమ్మ, శివమ్మ, లక్ష్మీశ్వరులు రుద్రహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. పూర్ణాహుతిలో కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, కొత్త వసా్త్రలు సమర్పించారు. అనంతరం వసంతోత్సవంలో పసుపు సున్నం కలిపిన నీటిని మంత్రజపంతో అధికారులు, భక్తులపై ప్రోక్షణ చేశారు. చండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొని వచ్చి, వేదపండితులు, ఈవో, చైర్మెన, ధర్మకర్తల మండలి సభ్యులు చండీశ్వరుని తలపై పెట్టుకొని త్రిశూలస్నాన కార్యక్రమాన్ని జరిపించారు.

సదస్యం నాగవల్లి - వేదస్వస్థి

భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం అనంతరం స్వామి, అమ్మవార్లకు సాంప్రదాయం ప్రకారం సదస్యం నాగవల్లి కార్యక్రమాన్ని నిత్యకళ్యాణ మండపంలో జరిపించారు. భ్రమరాంబ దేవికి మెట్టలు, నల్లపూసలు సమర్పించి నాగవల్లి జరిపించారు. బ్రహ్మోత్సావాల మొదటి రోజు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆవిష్కరించిన ధ్వజపట అవరోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. .

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగుస్తాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పదకొండో రోజైన బుధవారం సాయంత్రం అశ్వవాహన సేవ ఆలయ ఉత్సవం అనంతరం పుష్పోత్సవ శయనోత్సవ కార్యక్రమాలు జరగనున్నట్లు ప్రధానార్చకుడు విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Feb 18 , 2026 | 12:27 AM