గడువులోగా జల విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:57 AM
జలవిద్యుత్ కేంద్రం పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఏపీ జెన్కో ఎండీ పి.పుల్లారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పోలవరం ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రం పనుల్ని....
పోలవరం ప్రాజెక్టులో పనులు పరిశీలించిన ఏపీ జెన్కో ఎండీ
పోలవరం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జలవిద్యుత్ కేంద్రం పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఏపీ జెన్కో ఎండీ పి.పుల్లారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పోలవరం ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రం పనుల్ని ఆయన పరిశీలించారు. జల విద్యుత్ కేంద్రం ఎగువ దిగువ భాగాల్లో పనులు, అప్రోచ్ చానల్, ఇంటేక్ పూల్, నీటిలో వచ్చే వ్యర్థాలను నియంత్రించే గ్రిల్స్ పనులు, నీటి ప్రవాహాన్ని నియంత్రించి పెన్‌స్టాక్ స్పైరల్ వైపు మళ్లించే సివిల్ హైడ్రో మెకానికల్ నిర్మాణాలు, భారీ యంత్ర పరికరాల దిగుమతి నిల్వ అమరిక కోసం కేటాయించిన విభాగం, టర్బైన్, జనరేటర్ యూనిట్ల నిర్వహణ, మరమ్మతుల కోసం వినియోగించే విభాగం, విద్యుత్ ఉత్పత్తి చేసే 11 యూనిట్లు, టర్బైన్ రన్నర్‌కు సమానంగా నీటి పంపిణీ చేసే ప్రవేశ భాగాల్ని పరిశీలించారు. జనరేటర్ బ్యారెల్స్, ఎలక్ర్టికల్ ప్యానెల్స్, కంట్రోల్ సిస్టం, నిర్మాణాలు, టర్బైన్ ద్వారా ఉపయోగించిన నీటిని తాత్కాలికంగా నిల్వ ఉంచే ప్రాంతం, నీటిని నదీ ప్రవాహంలోకి పంపే కాలువల నిర్మాణాలను, ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు. పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు పూర్తయ్యే వ్యవధిలో జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమయ్యేలా పనులు వేగవంతంగా చేయాలని కాంట్రాక్టు సంస్థ మేఘా ప్రతినిధులకు సూచించారు. పనుల పురోగతిని అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని.. నిర్మాణంలో ఎలాంటి అవాంతరాలొచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రం రెండింటి నిర్మాణం ఏక కాలంలో పూర్తికావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు. పనుల పట్ల పుల్లారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.