Share News

పోలీసులపై ఫిర్యాదులకు ‘కంప్లైంట్‌ అథారిటీ’

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:01 AM

పోలీసులపై వచ్చే తీవ్రమైన ఫిర్యాదులను స్వతంత్రంగా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటుకు మార్గదర్శక ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసులపై ఫిర్యాదులకు ‘కంప్లైంట్‌ అథారిటీ’

  • రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పోలీసులపై వచ్చే తీవ్రమైన ఫిర్యాదులను స్వతంత్రంగా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటుకు మార్గదర్శక ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడైనా పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే బాధితులకు న్యాయం చేసేందుకు ఈ అథారిటీ సిద్ధంగా ఉంటుంది. కస్టడీ మరణాలు, అక్రమ నిర్బంధం, అత్యాచారం, భూ దందాలు, అధికార దుర్వినియోగం తదితరకేసుల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి చైర్మన్‌గా, సివిల్‌ సర్వీసు, పోలీసు, సివిల్‌ సొసైటీ నుంచి ఐదుగురికి మించకుండా సభ్యులు ఈ అథారిటీలో ఉంటారు. జిల్లా స్థాయిలో రిటైర్డ్‌ జిల్లా జడ్జి చైర్మన్‌గా, రిటైర్డ్‌ సీనియర్‌ సివిల్‌ సర్వెంట్‌, అదనపుఎస్పీ స్థాయి పోలీసు అధికారి, సివిల్‌ సొసైటీ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అదనపు ఎస్పీ, అంతకు పై అధికారులపై ఆరోపణలు వస్తే రాష్ట్ర స్థాయి అథారిటీ.. డీఎస్పీ అంతకు దిగువ స్థాయి పోలీసులపై ఫిర్యాదుల్ని జిల్లా అథారిటీ విచారిస్తుంది. విచారణ 90రోజుల్లో పూర్తి చేసి బాధితులకు న్యాయం చేకూర్చే బాధ్యత కమిటీపై ఉంటుంది.

Updated Date - Feb 26 , 2026 | 06:02 AM