‘కారుణ్యం’లో కిరికిరి!
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:47 AM
ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఎవరికైనా కనీస విద్యార్హతలు ఉండాలి. రాత్రింబవళ్లు కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో సత్తా చాటాలి. అయితే గత వైసీపీ సర్కారులో మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.
వైసీపీ పాలనలో అనర్హులకు కొలువుల పందేరం.. రాజకీయ సిఫారసులతో అడ్డగోలుగా అపాయింట్‌మెంట్లు
అత్యధికంగా జెడ్పీల్లో పోస్టులు కట్టబెట్టిన వైనం
వందలాది మంది అర్హులకు తీవ్ర అన్యాయం
ఆర్టీసీలో నిబంధనలకు
విరుద్ధంగా 150 మందికి ఉద్యోగాలు
జగన్ పాదయాత్రలో
పాల్గొన్నవారికి హోంగార్డు పోస్టులు
అగ్నిమాపక శాఖలోనూ
అడ్డగోలుగా నియామకాలు
ఈ-ఎస్‌ఆర్‌తో అక్రమాల
చిట్టాను వెలికితీస్తున్న విజిలెన్స్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఎవరికైనా కనీస విద్యార్హతలు ఉండాలి. రాత్రింబవళ్లు కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో సత్తా చాటాలి. అయితే గత వైసీపీ సర్కారులో మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తమ పార్టీ నేతల సిఫారసు లేఖతో వచ్చినవారికి విద్యార్హతలు, మెరిట్ చూడకుండానే ఉదారంగా కొలువులు కట్టబెట్టారు. కడప, అనంతపురం, ఏలూరు, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఆర్టీసీలోనూ అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. రాజకీయ సిఫారసులతో నియామకాలు చేసినట్లు కూటమి ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ అక్రమాలను వెలికితీసే బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించినట్లు సమాచారం. దీంతో జిల్లా పరిషత్‌లు మొదలుకొని పోలీసు శాఖలో హోంగార్డుల నియామకం వరకూ విజిలెన్స్ అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల డిజిటలైజ్ (ఈ-ఎస్ఆర్) ప్రక్రియతో అక్రమ అపాయింట్‌మెంట్ల చిట్టా వెలుగు చూస్తోంది.
అక్రమాల గుట్టు రట్టు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సచివాలయం, జిల్లా, గ్రామ, వార్డు స్థాయుల్లో కలిపి 10లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, జడ్పీల్లో తీర్మానాల ద్వారా వీరి నియామకాలు చేపడతారు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ నేతల సిఫారసులతోనే పోస్టులు భర్తీ చేసేశారు. ఈ విధంగా జిల్లా పరిషత్‌లలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో ఇటీవలే 15 అక్రమ నియామకాల గుట్టు రట్టయింది. గతంలో విశాఖలోనూ 40మందికి పైగా తప్పుడు దారిలో ఉద్యోగం పొందినట్లు తేలింది. అదేవిధంగా కారుణ్యం కింద వందలాది మంది తమ అనుయాయులకు వైసీపీ నేతలు ఉద్యోగాలు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేసినట్లు తెలుస్తోంది.
2017లో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయనతో పాటు నడిచి, సపర్యలు చేసిన 50మందిని 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో అవసరం లేకున్నా హోంగార్డులుగా నియమించారు. ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ సిఫారసుల మేరకు అగ్నిమాపక శాఖలోనూ ఇటువంటి నియామకాలు చేపట్టారు.
నియామకాల జీవో బేఖాతరు
2023లో ఏపీఎఎస్‌ఆర్టీసీలో 110మంది కానిస్టేబుళ్లు, 40మంది వరకూ జూనియర్ అసిస్టెంట్లను కారుణ్య నియామకం కింద తీసుకున్నారు. కుటుంబ పోషకుడు ఉద్యోగం చేస్తూ మరణిస్తే ఆ కుటుంబంలో అర్హులైన ఒకరికి డ్రైవర్, కండక్టర్, మెకానిక్ పోస్టులు ఇవ్వాలని 2022లో స్పష్టమైన జీవో ఉంది. ఈ పోస్టులు ఖాళీ లేకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆర్టీసీ జాబితా పంపాలి. అందుకు భిన్నంగా జగన్ సమీప బంధువు సిఫారసు మేరకు 150 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చేశారు. వీరికి ఏడాది పాటు జీతం చెల్లించలేదు. ఆ తర్వాత 20 మందిని తొలగించారు. ఇతరులకు మాత్రం చెల్లింపులు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక ఈ-ఎస్ఆర్ తప్పనిసరి చేయడంతో అక్రమ నియామకాలు వెలుగు చూస్తున్నాయి.
ఆమె విద్యుత్ శాఖలో నెలకు రూ.లక్షన్నర జీతం తీసుకొంటున్న ఇంజనీరు భార్య. జైళ్ల శాఖ ఉద్యోగి అయిన ఆమె తండ్రి ఆకస్మికంగా మరణించారు. దీంతో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కోసం గత ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న తానేటి వనిత సిఫారసుతో ఆమె దరఖాస్తు చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆమెకు వివాహమైందని, కారుణ్య నియామకానికి అర్హత లేదని అధికారులు తేల్చారు. దీంతో తాను విడాకులు తీసుకున్నానని పేర్కొంటూ ఏకంగా సంబంధిత పత్రాలను సమర్పిం చారు. ఈ విషయాన్ని గతేడాది ’ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ విచారణ జరిపించారు. ఆమె భర్తతో కలిసి ఉన్నట్లు తేలడంతో క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేశారు. ఈ వ్యవహారంలో చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.