Tirumala: సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:44 AM
తిరుమలలో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ఊహించని విధంగా అభిషేక దర్శనం దొరికింది. కేవలం అడ్వాన్స్, సిఫారసుపై టికెట్లు పొందిన భక్తులను మాత్రమే ఈసేవకు అనుమతిస్తారు.
15 ఏళ్ల తర్వాత తొలిసారి అమలు
తిరుమలలో సర్వదర్శన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
కిటకిటలాడుతున్న తిరుమల..
ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలో సాఫీగా క్యూలైన్లు
తిరుమల, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుమలలో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ఊహించని విధంగా అభిషేక దర్శనం దొరికింది. కేవలం అడ్వాన్స్, సిఫారసుపై టికెట్లు పొందిన భక్తులను మాత్రమే ఈసేవకు అనుమతిస్తారు. అయితే శుక్రవారం అభిషేక సేవ జరుగుతున్న సమయంలోనూ సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. దీంతో సేవ జరిగిన 4.30 నుంచి 6 గంటల మధ్య దాదాపు 3వేల మందికిపైగా సర్వదర్శన భక్తులకు అభిషేక సేవలో స్వామిని దర్శించుకునే అదృష్టం లభించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఆగిపోయిన ఈ విధానాన్ని తిరిగి శుక్రవారం అమలుచేశారు. కాగా.. తిరుమలలో ఎలాంటి టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చిన వారికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం నుంచే తిరుమల కిటకిటలాడింది. రద్దీ అధికమవుతున్న క్రమంలో గురువారం రాత్రి 11.30 నుంచే దర్శనాలకు భక్తులను అనుమతించారు. ఏకాంతసేవ ప్రారంభమయ్యే వరకు దాదాపు 4వేల మందికి సర్వదర్శనాలు చేయించారు. తిరిగి శుక్రవారం వేకువజామున తిరుప్పావై, కైంకర్యాలు పూర్తయిన తర్వాత 2గంటల నుంచి సర్వదర్శనాలు కొనసాగాయి. ప్రస్తుతం బాటగంగమ్మ ఆలయం సర్కిల్ వద్ద నుంచి సర్వదర్శన భక్తులను అనుమతిస్తున్నారు. వీరు రింగురోడ్డులో దాదాపు రెండున్నర కిలోమీటర్లు దూరం ఉండే క్యూలైన్‌లో వెళ్లి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 కంపార్టుమెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి 45,900 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వెళ్లినవారికి దాదాపు 16 గంటల దర్శన సమయం పడుతోంది. డిసెంబరు 30, 31, జనవరి 1 తేదీల్లో 2.02 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనం లభించింది. గత వైకుంఠద్వార దర్శనాల్లో తొలి మూడురోజులతో పోలిస్తే 18,461 మంది భక్తులు అదనంగా ఉత్తర ద్వార ప్రవేశం చేశారు.
ఆర్జిత, బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ
సామాన్య భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు సజావుగా సాగేందుకు వీలుగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను రద్దుచేసినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనాలు ఉన్నందున భక్తులు సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని కోరారు. క్యూలైన్‌లో వేచిఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారిసేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్టు తెలిపారు.
టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షల విరాళం
టీటీడీ ట్రస్టులకు శుక్రవారం రూ.20 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన రైడాన్ టెక్నాలజీస్ ప్రవేట్ లిమిడెట్ సంస్థ సీఈవో వంగల హర్షవర్ధన్ రూ.10లక్షలు ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జాయింట్ డైరెక్టర్ నేలబొట్ల శుభ సౌజన్య రూ.10 లక్షలు బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు అందజేశారు.
సమర్థంగా క్యూలైన్ల నిర్వహణ
గతానుభావాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి వైకుంఠద్వార దర్శనాల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టి సక్సెస్ అయింది. ఎంతమంది భక్తులు వచ్చినా చిన్నపాటి సమస్య లేకుండా పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు ముందుకు కదిలే క్రమంలో తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా ప్రతి వంద మీటర్లకు అడ్డుగా ఓ బారికేడ్ ఏర్పాటు చేశారు. విడతల వారీగా యాభై నుంచి వందమంది చొప్పున భక్తులను అనుమతించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో ఉన్న ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. రద్దీ ఎక్కడ అధికంగా ఉంది, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో పరిశీలిస్తూ ఆయా ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేయడంతో క్యూలైన్లన్నీ ఏకకాలంలో సాఫీగా సాగాయి. దాదాపు 3,500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బందితో క్యూలైన్లను నిర్వహిస్తున్న క్రమంలో నాలుగో రోజు సర్వదర్శన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా ముగిశాయి.