Share News

‘కల్తీ నెయ్యి’లో వారి పాపం తేల్చండి

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:06 AM

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కల్తీ నెయ్యి సరపరా ఉదంతంలో నాటి బోర్డు సభ్యులు, అధికారుల వైఫల్యాలు, తప్పిదాలను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘కల్తీ నెయ్యి’లో వారి పాపం తేల్చండి

  • రిటైర్డు ఐఏఎస్‌ దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు

  • అప్పటి టీటీడీ సభ్యులు,అధికారుల తప్పిదాలపై విచారణ..రూల్స్‌ సడలింపుపై లోతైన పరిశీలన

  • అందులో ఎవరి బాధ్యత ఎంతనేది తేల్చనున్న కమిటీ

  • 45 రోజుల్లోగా నివేదిక.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కల్తీ నెయ్యి సరపరా ఉదంతంలో నాటి బోర్డు సభ్యులు, అధికారుల వైఫల్యాలు, తప్పిదాలను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రిటైర్డ్‌ ఐఏఎస్‌, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు (జీవో నం. 458) జారీ చేశారు. తిరుమల దేవస్థానానికి కల్తీనెయ్యి సరఫరా వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరిపింది. గత నెల 23న కోర్టులో తుది చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీంతోపాటు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ తన సంతకంతో రెండు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. టీటీడీ నెయ్యి టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌, నిబంధనల ఉల్లంఘన, అధికారుల స్థాయిలో జరిగిన తప్పిదాలు, బోర్డు సభ్యుల పనితీరు వంటి అనేకానేక అంశాలను అందులో ప్రస్తావించారు. టెండర్‌ నిబంధనలను సడలించడం వల్లే కల్తీనెయ్యి సరఫరాకు రాచ బాటలు పడ్డాయని, ఇందులో నాటి అధికారుల పాత్ర ఉందని సీబీఐ జేడీ పంపించిన నోట్‌లో ఉంది. కల్తీనెయ్యి సరఫరా అనేది ఘోరమైన అపచారం, నేరం అని పేర్కొంటూ, ఇకపై ఎలాంటి తప్పులకూ ఆస్కారం లేకుండా టీటీడీలో పాలనాపరంగా, విధానపరంగా సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపధ్యంలో నాటి కల్తీనెయ్యి ఉదంతంలో కమిటీ సభ్యులు, అధికారుల పాలనాపరమైన వైఫల్యాలను గుర్తించి, వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఏకసభ్యకమిటీని ఏర్పాటు చేసింది. కల్తీనెయ్యి ఉదంతంపై సీబీఐ ప్రభుత్వానికి పంపించిన నోట్‌లను పరిశీలించి, తప్పులు చేసిన నాటి బోర్డు సభ్యులు, సీనియర్‌ అధికారుల వైఫల్యాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


కమిటీ పరిశీలించే అంశాలు..

నెయ్యి టెండర్‌ నిబంధనలు సడలించడం వెన క ఉద్దేశాలు, లోపాలు, పాలనా వైఫల్యాలను అంచనా వేయడం, టెండర్‌ నిబంధనలను సడలించడంలో శ్రద్ధ వహించారా? నిబంధనల ప్రకారం నడుచుకున్నారా? ఇందుకు హేతుబద్ధత ఉందా? అనేది కమిటీ పరిశీలించనుంది. సిట్‌ గుర్తించిన, లేవనెత్తిన వైఫల్యాల్లో కమిటీ సభ్యులు, అధికారుల పాలనాపరమైన బాధ్యత ఎంతనేది గుర్తిస్తుంది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ పరిశీలన పూర్తిగా పాలనాపరమైన, ప్రభుత్వ పరమైన కోణాలకే పరిమితం కావాలని సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. పరిశీలన, విచారణ సందర్భంగా ప్రభుత్వ ఆమోదంతో కమిటీ ఏ అధికారినయినా పిలవొచ్చని, లిఖితపూర్వక సమాధానాలు తీసుకోవచ్చని, రికార్డులను పరిశీలనకు తీసుకోవచ్చని తెలిపారు. కమిటీ తన పరిశీలనను 45 రోజుల్లోగా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు. కమిటీ విచారణకు టీటీడీ పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీచేశారు.

Updated Date - Feb 21 , 2026 | 04:07 AM