రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి కృషి రోడ్ మ్యాప్
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:19 AM
ఏపీలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర స్థూల విలువ జోడింపులో 15 శాతం వృద్ధి లక్ష్యంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్...
సీఎం విజ్ఞప్తితో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఏపీలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర స్థూల విలువ జోడింపులో 15 శాతం వృద్ధి లక్ష్యంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ‘కృషి రోడ్ మ్యాప్(వ్యవసాయ ప్రణాళిక)’ కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్‌కుమార్ అగర్వాల్ కన్వీనర్‌గా కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖల చెందిన ఐఏఎ్‌సలు, రీసెర్చ్ హెడ్‌లతో కలిపి 13 మంది కమిటీలో ఉన్నారు. కమిటీ తొలి సమావేశం బుధవారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌లో జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘రాయలసీమను గ్లోబల్ హర్టీకల్చర్ హబ్‌గా తయారు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ ఆధారిత వ్యవస్థ నుంచి ఉద్యాన ఆధారిత వ్యవస్థగా మార్పు సాధించనున్నాం’ అని తెలిపారు. దీనిపై కమిటీ కన్వీనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘సీఎం ఆశయాలకు అనుగుణంగా ఏపీలో వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం తోడ్పాటుకు కమిటీ అన్ని విధాలా సహకరిస్తుంది. విలువ ఆధారిత పంటల సాగు, కేంద్ర-రాష్ట్ర పథకాల అమలుకు అధికారుల సమన్వయం అత్యంత కీలకం’ అని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల ప్రగతి, జీవీఏ, రైతుకు నికరాదాయం పెంపుదల అవకాశాలపై కేంద్ర కమిటీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఈ కమిటీ... గురువారం ఏలూరు జిల్లాలో పర్యటించనుంది.