ఏళ్లు గడిచినా ఎటూ తేల్చరు!
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:48 AM
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆ శాఖలో రెండు దశాబ్దాలకు పైగా నలుగుతున్న సీనియారిటీ వివాదం అడ్డంకిగా మారింది.
వాణిజ్య పన్నుల శాఖలో ‘సీనియారిటీ’ రచ్చ
రెండు దశాబ్దాలకు పైగా నలుగుతున్న వివాదం
దిగువ క్యాడర్ల అధికారులకు నిలిచిన పదోన్నతులు
ఏళ్ల తరబడి ఖాళీగా 50 ఏసీ పోస్టులు
డీపీసీ ఆమోదం తెలిపినా ముందుకు కదలని ప్రక్రియ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆ శాఖలో రెండు దశాబ్దాలకు పైగా నలుగుతున్న సీనియారిటీ వివాదం అడ్డంకిగా మారింది. 1999లో గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఏసీటీవోల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. రెండు విడతలుగా (2001, 2005) నియమితులైన ఏసీటీవోల సీనియారిటీని మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని 2015లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 33(బీ) నిబంధన ప్రకారం 2021లో వారి సీనియారిటీని నిర్ణయించింది. అయితే 2001 బ్యాచ్‌కు చెందిన కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. తమ జాయినింగ్ తేదీ ఆధారంగా సీనియారిటీని నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన న్యాయమూర్తి ప్రభుత్వం రూపొందించిన సీనియారిటీ జాబితాను రద్దుచేసి కొత్త జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై 2005 బ్యాచ్ అధికారులు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసుకున్నారు. దాంతో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు... కేసు విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ వివాదంతో శాఖలో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 180 పోస్టుల్లో 45 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. ఇదిలా ఉండగా.. వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ (సీఆర్‌యూ) కోసం ప్రభుత్వం ఐదు అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను గతేడాది డిసెంబరులో ప్రత్యేకంగా మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరిలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీస్టాట్)కోసం మరో రెండు అడిషనల్ కమిషనర్ పోస్టులు, 4 జాయింట్ కమిషనర్ పోస్టులు, 8 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ ఖాళీలను కూడా ఇంకా భర్తీ చేయలేదు. ఈ పోస్టులను భర్తీచేస్తే డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, జీఎస్టీవో, సీనియర్ అసిస్టెంట్ వరకు వివిధ క్యాడర్లలో ఉన్న దాదాపు 200 దిగువ స్థాయి పోస్టులను భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. శాఖలో 20 డిప్యూటీ కమిషనర్, ఆ పైస్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు నెల క్రితం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ.. ఆ ప్రక్రియను కూడా నిలిపివేశారు. పదోన్నతులు కల్పించడానికి కోర్టు కేసులు అవరోధంగా ఉన్నప్పుడు వెంటనే అఫిడవిట్లు దాఖలు చేయాల్సిన ఉన్నతాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని దిగువస్థాయి క్యాడర్ల అధికారులు వాపోతున్నారు. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పన్నుల వసూళ్లపై, ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెబుతున్నారు. సీనియారిటీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.