Share News

కార్యాలయంలోనే కలెక్టర్లు!

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:24 AM

కలెక్టర్లు... జిల్లాకు వారే సర్వాధికారులు. ఇతర అధికారులెవరికీ లేని ‘సార్వభౌమాధికారం’ కలెక్టర్‌ చేతిలో ఉంటుంది. కలెక్టర్‌ సరిగ్గా పనిచేస్తే ఆ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.

కార్యాలయంలోనే కలెక్టర్లు!

  • క్షేత్రస్థాయి పర్యటనలకు స్వస్తి.. గణాంకాలు, నివేదికలతోనే కుస్తీ

  • పల్లె నిద్రల్లేవు.. గ్రామసభలు జరగవు

  • ప్రభుత్వ పెద్దలు వస్తేనే ప్రజల్లోకి!

  • క్షేత్రస్థాయి సిబ్బంది సేవలూ కలెక్టరేట్లలోనే

  • కోఆర్డినేటర్లనే నమ్ముకున్న జిల్లా సారథులు

  • కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు.. అమలులో తుస్సు

  • కుంటుపడిన తనిఖీలు, పర్యవేక్షణలు

  • ఫలితమే కల్తీ, డయేరియా, పేలుడు ఘటనలు!

తారీఖులు, దస్తావేజులు.. ఇవి కావోయ్‌ చరిత్రకర్థం! అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు! కానీ... వర్తమానంలో కాగితాలు, గణాంకాలు, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లే సర్వస్వంగా మారాయి. జిల్లా స్థాయిలో పాలనకు సారథ్యం వహించాల్సిన కలెక్టర్లు నిత్యం అంకెలతో కుస్తీపడుతున్నారు. తమదైన ముద్ర వేయలేకపోతున్నారు. బుధ, గురువారాల్లో మరోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు ఏవైనా అమలయ్యాయా? జిల్లాల్లో అసలేం జరుగుతోంది? ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనాత్మక కథనం...

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి శాఖకూ సొంత సిబ్బంది ఉన్నారు. వారు జాబ్‌చార్ట్‌ మేరకు పనిచేస్తున్నారా, లేదా? రోజువారీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి? ఇది చూడాల్సిందికలెక్టరే. అంటే, కలెక్టర్‌ తాను పనిచేస్తూ, దిగువస్థాయి ఉద్యోగులతోనూ పని చేయించాలి. కానీ... చాలామంది ప్రభుత్వానికి సమర్పించే నివేదికలపైనే ఫోక్‌స పెట్టి క్షేత్రస్థాయు పర్యవేక్షణను వదిలేశారు.

ఏదైనా ప్రమాదం, విపత్తు, అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో కలెక్టర్‌ రోజు వారీగా తెలుసుకొనే వీలు లేకుండాపోతోంది. రోజువారీగా పీపీటీల తయారీ, లెక్కలతో కుస్తీ, అందమైన నివేదికల తయారీ.. ఇదే పని!

తనిఖీ, నియంత్రణ వ్యవస్థలతో క్రమంతప్పకుండా పనిచేయించాల్సిన బాధ్యత కలెక్టర్‌దే. ఇది సక్రమంగా జరగనందుకే.. కల్తీపాలు, డయేరియా, బాణసంచా పేలుళ్ల ఘటనలు జరిగాయన్నది అధికార వర్గాల మాట.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కలెక్టర్లు... జిల్లాకు వారే సర్వాధికారులు. ఇతర అధికారులెవరికీ లేని ‘సార్వభౌమాధికారం’ కలెక్టర్‌ చేతిలో ఉంటుంది. కలెక్టర్‌ సరిగ్గా పనిచేస్తే ఆ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. లేకుంటే... అంతిమంగా నష్టపోయేది ప్రభుత్వమే. అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రిగాఉన్న ప్రతిసారీ కలెక్టర్ల సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఫలితాలకోసం వెంట పడతారు. అప్పుడప్పుడు అదిలిస్తుంటారు. కానీ, ఇప్పుడేం జరుగుతోందో తెలియడం లేదు! మూడు నెలలకోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నా... క్షేత్రస్థాయికి వెళ్లే సరికి దాని ఫలితం దాదాపుగా కనిపించడం లేదు. ‘అందరూ అంతే’ అని అనలేం కానీ... చాలా మంది కలెక్టర్లు విధి నిర్వహణలో రోబోలుగా పనిచేస్తున్నారు. మనసుపెట్టి పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ‘క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజలతో మమేకం కండి’ అని సీఎం చెబుతున్నా... దానిని ఆచరిస్తున్న దాఖలాలు లేవు. కార్యాలయాలకు పరిమితం కావడం, ఏవో కొన్ని గ్రూపులు ఏర్పాటుచేసుకొని మమ అనిపించడం తప్ప మరో అద్భుతం జరగడం లేదు. సీఎంతో సమావేశం అనగానే ఓ అందమైన కలర్‌ఫుల్‌ ప్రజంటేషన్‌ తయారు చేయడం, పదాల గారడీతో బిల్డప్‌ ఇవ్వడం!


‘పల్లె నిద్ర’ ఏదీ?

కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటింది. ఇప్పటికి ఐదుసార్లు కలెక్టర్ల సదస్సులు జరిగాయి. పల్లెనిద్ర చేసిన వారు ఎందరు? ప్రజలతో గ్రామసభలు నిర్వహించిన కలెక్టర్లు ఎక్కడ? అంటే సమాధానం చెప్పడం కష్టం. పైగా... క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని కలెక్టరేట్లకు పిలిపించుకొని అక్కడే పనిచేయించుకుంటున్నారు.

సమస్యలు తెలిసేదెలా...

ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య అధికార వారధి కలెక్టర్లే! క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ‘లెన్స్‌’కు అందని అంశాలు, సమస్యలను వీరే గుర్తించాలి. ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరడంలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగానే ఇటీవలి కాలంలో జిల్లాల్లో చోటుచేసుకున్న విపరీత పరిణామాలు! పాలన పనితీరుకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజా స్పందనే గీటురాయు. ఇది తెలియాలంటే కలెక్టర్లు పల్లెలు, పట్టణాల్లో పర్యటించాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని సీఎం పదేపదే చెబుతున్నారు. కానీ... జిల్లా కేంద్రం దాటి జనంలోకి వెళ్తున్న కలెక్టర్ల సంఖ్య చాలాచాలా తక్కువ. ప్రభుత్వం అడిగే వివిధ రకాల సమాచారం సేకరించడం, వాటిపై నివేదికలు తయారుచేసి రిపోర్టులు, పీపీటీల రూపంలో పంపించే పనులకే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల గురించి ఆలోచించే అవకాశమే ఉండటం లేదని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు వారితో వెళ్లడమే తప్ప... మిగతా సందర్భాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు ఉండటం లేదు. ఇదొక ప్రమాదకర సంకేతమని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.


వారిపైనే ఆధారపడుతూ...

కీలకమైన పాలనాపరమైన అంశాలను జిల్లా స్థాయి గ్రామ, వార్డు సచివాలయాల కో-ఆర్డినేటర్‌ల కు అప్పగించి కలెక్టర్లు చేతులు దులుపుకొంటున్నార నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ కో-ఆర్డినేటర్లపైఆధారపడుతూ, వారిచ్చే నివేదికలనే పరిగణలోకి తీసుకుంటున్నారని, వాస్తవిక పరిస్థితిని అంచనావేయలేకపోతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నిజానికి ఆ కో-ఆర్డినేటర్లు వైసీపీ హయాంలో నియమితులైనవారే. అందులోనూ.. ఐప్యాక్‌ ద్వారా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో వచ్చినవారే. వారిపై అపరిమిత నమ్మకం ఉంచి కలెక్టర్లు కీలకమైన ఆ విభాగాలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజారోగ్యం, భద్రత, సంక్షేమం స్వయంగా పర్యవేక్షించాల్సిన కలెక్టర్లు... పనిభారం పేరిట ఆ బాధ్యతను జిల్లా కో-ఆర్డినేటర్లపైకి నెట్టినట్లు ఆరోపణలున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగులుకాని జిల్లా-కోఆర్డినేటర్‌లకు జవాబుదారీ ఎక్కడ ఉంటుంది? ఇటీవల డయేరియా మరణాలు చోటుసుకున్న శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న సమన్వయకర్తపై అనేక ఫిర్యాదులున్నాయి. కొందరు సమన్వయకర్తలు పాలనకు బదులు సొం త రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

లెక్కలేవీ...

గత 20 నెలల వ్యవధిలో ఐదుసార్లు కలెక్టర్ల సదస్సులు జరిగాయి. ఎంత మంది కలెక్టర్లు పల్లె నిద్రచేశారు? ఎంత మంది గ్రామ సచివాలయాలను తనిఖీచేశారు? ఎంత మంది గ్రామ సభలు నిర్వహించారు? వీటికి లెక్కలేలేవు. కానీ... ఎన్ని అంశాలపై ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు? ఎన్ని పీపీటీలు పంపించారనే గణాంకాలు మాత్రం ఉన్నాయి.


నేటి నుంచి కలెక్టర్ల సదస్సు

బుధవారం, గురువారం రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొలిరోజు.. అభివృద్ధి, విజన్‌ 2047, సంక్షేమంపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం అనంతరం అజెండా ప్రకారం ఆయా అంశాలపై శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రజెంటేషన్‌లు ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర, పది సూత్రాల అమలు, జలభద్రత, వ్యవసాయరంగం, జీఎ్‌సడీపీ, జిల్లాల వారీగా సాధించిన లక్ష్యాలపై సీఎం చర్చిస్తారు. డిజిటల్‌ గవర్నెన్స్‌లో భాగంగా ఈ-ఆఫీస్‌ విధానం అమలు, పెట్టుబడి ప్రతిపాదనల అమలుపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. సదస్సు రెండో రోజున ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై కీలక చర్చ జరుగుతుంది. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుతీరు, మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో తాగునీటి ప్రణాళికల అమలు, భూ పరిపాలన, రెవెన్యూ, విద్య, ఉపాఽధి అవకాశాలపై సీఎం చర్చిస్తారు. సాయంత్రం శాంతి భద్రతలపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఈ సెషన్‌కు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీలు కూడా హాజరవుతారు.


అంతా కలెక్టర్‌ చుట్టూనే..

  • గతంలో సచివాలయ సిబ్బంది రోజువారీగా ఏం చేయాలో జాబ్‌చార్ట్‌ ఉండేది. రేషనలైజేషన్‌ పేరిట సిబ్బందిని ఆయా శాఖలకు తరలించారు. కీలకమైన సాంకేతిక సిబ్బందిని సైతం కలెక్టర్లు తమ పరిధిలోకి తీసుకున్నారు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు...

  • ప్రతి వార్డులో ఎమినిటీస్‌ కార్యదర్శులు ఉంటారు. వీరి పనల్లా వార్డుల పరిధిలో ప్రజా అవసరాలను పర్యవేక్షించడమే! తాగునీటిని రోజువారీగా పరీక్షించి నాణ్యతను నిగ్గుతేల్చడం అందులో భాగం. ఇటీవలి కాలంలో ఎమినిటీస్‌ కార్యదర్శులనూ కలెక్టరేట్లకు తీసుకెళ్లారు. దీని ఫలితమే శ్రీకాకుళం మున్సిపాలిటీలో డయేరియా ప్రబలి ప్రజల మరణాలకు దారితీసింది. నీటి నాణ్యతను పరీక్షించే సిబ్బంది కూడా శ్రీకాకుళం కలెక్టరేట్‌లోనే పనిచేస్తున్నారు. నిజానికి ఈ విషయంలో అంతకు ముందు సుదీర్ఘకాలం పనిచేసిన మునిసిపల్‌ కమిషనర్‌ వైఫల్యం ఉంది. కానీ, అప్పుడే కొత్తగా వచ్చిన కమిషనర్‌పై చర్యలు తీసుకున్నారు. మరి... ఎమినిటీస్‌ కార్యదర్శిని కలెక్టరేట్‌కు రప్పించుకున్న కలెక్టర్‌కు ఇందులో బాధ్యత లేదా?

  • కొన్ని జిల్లాల్లో వెల్ఫేర్‌ సెక్రెటరీలను కూడా కలెక్టరేట్‌లకు తరలించారు. వారు లేకుండా పింఛన్లను ఎలా పంపిణీ చేస్తారు?

  • రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇప్పటికీ చాలామంది ఆస్పత్రుల్లోనే ఉన్నారు. కల్తీని అరికట్టే బాధ్యత కలెక్టర్‌దే. కలెక్టర్‌ ఈ విషయంలో ప్రత్యేక సమీక్ష చేసి తనిఖీలు నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికార వర్గాలే చెబుతున్నాయి.

  • గత నెల 28న కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సంభవించింది. పాతికమందిపైనే మరణించారు. కాకినాడ జిల్లా పరిధిలో భారీగా బాణసంచా కేంద్రాలున్నాయి. గత ఏడా ది అక్టోబరులో కోనసీమ జిల్లా రాయవరంలో నూ పేలుడు సంభవించిం ది. ఆ సంఘటనను దృష్టిలో ఉం చుకొని క్రమంతప్పకుండా తనిఖీలు నిర్వహించి ఉంటే వేట్లపాలెం ఘటన జరిగేదే కాదని చెబుతున్నారు.

Updated Date - Mar 11 , 2026 | 06:18 AM