Share News

Endowment Lands: అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్‌

ABN , Publish Date - Jan 03 , 2026 | 04:46 AM

ప్రభుత్వ, దేవదాయ, అసైన్డ్‌ భూములు, నకిలీ రిజిస్ర్టేషన్లు, ఫోర్జరీ సంతకాలతో జరిగిన రిజిస్ర్టేషన్లను రద్దు చేసే బాధ్యతను కలెక్టర్‌ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 Endowment Lands: అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్‌

  • కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీకి ‘రద్దు’ అధికారాలు

  • ప్రభుత్వ, దేవదాయ, అసైన్డ్‌, నకిలీ, డబుల్‌

  • రిజిస్ట్రేషన్లన్నీ కమిటీ పరిధిలోకే

  • తప్పు చేసే సబ్‌ రిజిస్ట్రార్‌లకు మూడేళ్లదాకా జైలు

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, దేవదాయ, అసైన్డ్‌ భూములు, నకిలీ రిజిస్ర్టేషన్లు, ఫోర్జరీ సంతకాలతో జరిగిన రిజిస్ర్టేషన్లను రద్దు చేసే బాధ్యతను కలెక్టర్‌ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025 జూలైలోనే ఈ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ... కమిటీకి విధి విధానాలు నిర్ణయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్రమ రిజిస్ర్టేషన్లు రద్దు చేసే అధికారం సివిల్‌ కోర్టులకు మాత్రమే ఉంది. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాల రిజిస్ర్టేషన్లు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్రమ ఆస్తుల రిజిస్ర్టేషన్ల నిరోధానికి జాతీయ రిజిస్ర్టేషన్‌ చట్టం - 1908 (సవరించిన/ఏపీ యాక్ట్‌ అమెండ్‌మెంట్‌ - 2023) బిల్లుకు 2023 మార్చి 20న శాసనసభ ఆమోదం తెలిపింది. రిజిస్ర్టేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్టు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజిస్ర్టార్‌ వాటిని పరిశీలిస్తారు. ఆధారాల ప్రాతిపదికన కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి తగిన సిఫారసు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రిజిస్ర్టార్‌, ఆర్‌డీవో ఉంటారు.


ఆధారాలు సమంజసంగా ఉంటే ఆ కమిటీ ఆదేశాల మేరకు రిజిస్ర్టేషన్లు రద్దవుతాయి. 22ఏలో ఉన్న ప్రభుత్వ, దేవదాయ, అసైన్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లు... ఒక ఆస్తిని ఒకరి కంటే ఎక్కువ మందికి విక్రయించిన కేసులుండే 22బి జాబితా... కోర్టు, ఐటీ, జీఎస్టీ ఎటాచ్‌మెంట్‌ ఉన్న భూములుండే 22సి జాబితాల్లోని భూముల రిజిస్ర్టేషన్లను కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా, ఆధారాల మేరకు ఈ కమిటీయే రద్దు చేయొచ్చు. ఫోర్జరీ ద్వారా జరిగిన రిజిస్ర్టేషన్లు కూడా 22సి జాబితాలోకి వస్తాయి. కానీ, ఫోర్జరీ జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సవరణ ప్రకారం, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రిజిస్ర్టేషన్లు చేసినా, ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ర్టేషన్‌ చేసినా, కోర్టు ఎటాచ్‌మెంట్‌లో ఉన్న వాటికి రిజిస్ర్టేషన్లు చేసినా అలాంటి సబ్‌ రిజిస్ర్టార్లకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.


ఫ్రీ హోల్డ్‌ అక్రమాల మాటేమిటి?

జగన్‌ హయాంలో ఫ్రీహోల్డ్‌ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ వాటిని రద్దు చేయడం సులభమని భావించి ఆగమేఘాల మీద 2025 జూలైలోనే నోటిఫికేషన్‌ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్‌పై విధించిన నిషేధాన్ని మాత్రం ఎత్తేయలేదు. దీంతో ఆ అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా ఈ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాడు నిషేధిత జాబితా నుంచి విడిపించిన 13 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూముల్లో 25 వేల ఎకరాలకు రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఇందులో అక్రమాలు జరిగినవి 7వేల ఎకరాల వరకు ఉన్నాయి. ఈ ఉత్తర్వులతో, కలెక్టర్‌ కమిటీ ద్వారా ఇలాంటి రిజిస్ర్టేషన్లు రద్దు చేయడం సులభమే కానీ, ప్రస్తుతం ఆ అక్రమాలేవీ ఈ కమిటీ పరిధిలోకి రావు. ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌పై నిషేధం ఎత్తేస్తేనే అది సాధ్యమవుతుంది.

Updated Date - Jan 03 , 2026 | 04:48 AM