వసూళ్ల ‘కిక్’!
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:53 AM
ట్రాఫిక్ పోలీసులు ఏలూరు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించారు. ఓ వైద్యుడి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు మద్యం తాగి కారు నడిపాడు. ఐఎంఏలో ఉన్న వైద్యుడిని ఇంటికి తీసుకెళ్లడం కోసం వస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. డ్రైవర్ కిందికి దిగ్గానే మద్యం వాసన వచ్చింది. బ్రీత ఎనలైజర్‌తో పనిలేకుండా వాసనతోనే డ్రైవర్ మద్యం తాగాడాని నిర్ధారించారు. వెంటనే ఓ కానిస్టేబుల్ అతడిని పక్కకు తీసుకెళ్లాడు. కేసు నమోదు చేస్తామని హడావుడి చేసి తర్వాత బేరాలు మొదలు పెట్టాడు. రూ.5వేలు ఇస్తే వదిలేస్తానని భరోసా ఇచ్చాడు. తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, వాటిని ఇచ్చే వరకు ఫోన్ ఉంచుకోవాలని డ్రైవర్ చెప్పాడు. అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ మర్నాడు రూ.5వేలు తీసుకుని వస్తువును అప్పగించాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఇది.
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో విచిత్రాలు!
- మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు పట్టుకుంటున్న పోలీసులు
- హడావుడి చేసి చాటుకు తీసుకెళ్లి బేరాలు
- కేసు నమోదు చేయకుండా నగదు డిమాండ్
- రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు
- హాట్ టాపిక్‌గా మారిన ‘ట్రాఫిక్’ డ్యూటీ
ట్రాఫిక్ పోలీసులు ఏలూరు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించారు. ఓ వైద్యుడి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు మద్యం తాగి కారు నడిపాడు. ఐఎంఏలో ఉన్న వైద్యుడిని ఇంటికి తీసుకెళ్లడం కోసం వస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. డ్రైవర్ కిందికి దిగ్గానే మద్యం వాసన వచ్చింది. బ్రీత ఎనలైజర్‌తో పనిలేకుండా వాసనతోనే డ్రైవర్ మద్యం తాగాడాని నిర్ధారించారు. వెంటనే ఓ కానిస్టేబుల్ అతడిని పక్కకు తీసుకెళ్లాడు. కేసు నమోదు చేస్తామని హడావుడి చేసి తర్వాత బేరాలు మొదలు పెట్టాడు. రూ.5వేలు ఇస్తే వదిలేస్తానని భరోసా ఇచ్చాడు. తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, వాటిని ఇచ్చే వరకు ఫోన్ ఉంచుకోవాలని డ్రైవర్ చెప్పాడు. అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ మర్నాడు రూ.5వేలు తీసుకుని వస్తువును అప్పగించాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఇది.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
మద్యం తాగి వాహనాలను నడిపి మందుబాబులు అమాయకుల ప్రాణాలు తీసేస్తుంటే, వారిపై చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్ విభాగంలో కొందరు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. నిత్యం జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తమకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. బార్‌ల్లో నోరు తడుపుకున్నా బయటకు వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసుల చేతులు తడిపితే చాలన్న ధీమా మందుబాబుల్లో పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణమే కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలని తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్‌లకు అనుమతి ఇవ్వడంతో యువకులు, ఆకతాయిలు పీకల దాకా తాగి రాత్రిపూట రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతున్నారు. తాగిన మైకంలో వాహనాలను నియంత్రించుకోలేకపోతున్నారు. ఫలితంగా పాదచారులనో, ఇతర వాహన చోదకులనో ఢీ కొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు.
అదే పనిలో ఒకరు!
మందుబాబుల భరతం పట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేయాలని పోలీస్ అధికారులు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. నగరంలో ఉన్న అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోని ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది వారి పరిధిలో ఎక్కడో ఒక చోట ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐతో పాటు ముగ్గురు, నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వారిలో ఒకరు మాత్రం మద్యం మత్తులో ఉన్న వారిని పట్టుకుని బేరాలు సెట్ చేసుకునే పనిలో ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఒకరు వాహనాలను ఆపుతారు. మరొకరు బ్రీత ఎనలైజర్‌తో వాహనదారుడిని పరీక్షిస్తారు. ఈ ప్రక్రియను మరొకరు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరణ చేస్తారు. ఇలా వాహనాలను ఆపే సిబ్బంది మందు బాబులు చిక్కినా కేసులు నమోదు చేయకుండా రక్షణ కల్పిస్తున్నారు.
సీసీ కెమెరాలు లేకపోతే అక్కడే బేరం
ఎన్‌ఫోర్స్‌మెంట్ జరిగే ప్రదేశంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోతే అక్కడే మొత్తం బేరం కుదుర్చుకుంటున్నారు. అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే మాత్రం వాహనదారులను పక్కన నిలబెడుతున్నారు. వారు ఎటూ పారిపోకుండా వాహనం తాళాలు లాక్కుంటున్నారు. పోలీసులకు దొరికిపోయిన వాహనదారులు తమను కాపాడమని వేడుకుంటున్నారు. బేరాల కథను ట్రాఫిక్ పోలీసులు ఇక్కడి నుంచి మొదలుపెడుతున్నారు. కేసు నమోదు చేస్తే కోర్టు రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు జరిమానా విధిస్తుందని, ఒక్కోసారి జైలుకు పంపుతుందని బెదిరిస్తున్నారు. దీంతో వాహనదారులు ఎంతో కొంత ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన మొత్తంలో సగ భాగాన్ని వారి చేతుల్లో పెట్టేసి వాహనాలను తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈ తరహా తతంగం కొన్నాళ్లుగా ట్రాఫిక్ విభాగంలో జరుగుతోందని సమాచారం. ఈ మధ్యలో మరింత ఎక్కువైనట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను వివిధ పటిష్ట ప్రణాళికలను అమలు చేసి 16 శాతం తగ్గించినందుకు సీఎం చంద్రబాబు కమిషనరేట్ అధికారులను అభినందించారు. క్షేత్రస్థాయిలో కొంతమంది చేస్తున్న వ్యవహారాలు ఈ ప్రశంసలకు తలవంపులు తెచ్చేలా తయారవుతున్నాయి.