కాగ్నిజెంట్ పనులకు శ్రీకారం
ABN , Publish Date - May 02 , 2026 | 04:04 AM
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూడు దశల్లో భవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఈ క్యాంపస్‌లో 13 అంతస్తుల ఐటీ టవర్‌తో పాటు...
విశాఖలో మూడు దశల్లో క్యాంపస్ నిర్మాణం
పర్యావరణ అనుమతులు మంజూరు
ఓ ఫేజ్‌లో 13 అంతస్తుల టవర్, 4 పోడియంలు
కార్ పార్కింగ్ కోసం 5 ఫ్లోర్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూడు దశల్లో భవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఈ క్యాంపస్‌లో 13 అంతస్తుల ఐటీ టవర్‌తో పాటు ఇతర నిర్మాణాలు కూడా ఉంటాయి. వీటికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. కాగ్నిజెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 99 పైసలు చొప్పున 22.19 ఎకరాలను కేటాయించింది. మధురవాడలోని సర్వే నంబర్లు 394/1, 394/2పి, 395/1పి, 395/2పి, 396/పి, 397/పిలలో ఈ భూములు ఉన్నాయి. ఐటీ పార్కు ప్రాంతంలో వీఎంఆర్‌డీఏ గేటెడ్ కమ్యూనిటీ హరిత పక్కనే ఈ భూములు ఇచ్చారు. గత ఏడాది డిసెంబరు 12న సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఏడాదిలో తొలి దశ నిర్మాణం పూర్తి కావాలని, ప్రతి వారం తాను నిర్మాణ పనులు సమీక్షిస్తానని ప్రకటించారు. ఇక్కడ ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కాగ్నిజెంట్ తొలుత ఒప్పందం చేయగా, 25 వేల మందికి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. దానికి కాగ్నిజెంట్ అంగీకరించింది. శంకుస్థాపన జరిగిన నాలుగు నెలల తరువాత ప్రహరీ గోడ నిర్మాణానికి తాజాగా పనులు ప్రారంభించారు. అయితే తాత్కాలికంగా రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నంబరు 2పై గల ‘మహతి’ భవంతిలో కొంత స్థలం అద్దెకు తీసుకొని అక్కడ ఇటీవలే ఆపరేషన్లు ప్రారంభించారు. కాగ్నిజెంట్‌కు కేటాయించిన భూమిలో 89,799.74 చ.మీ. లేఅవుట్ రూపొందించారు. అందులో 21,309.44 చ.మీ.ప్లింత్ ఏరియాలో భవనాలు నిర్మిస్తారు. మల్టీ లెవెల్ కారు పార్కింగ్ కోసం ఐదు ఫోర్లు కేటాయించారు.