Share News

Bapatla District: బరిలోకి.. బాపట్ల

ABN , Publish Date - Jan 15 , 2026 | 04:28 AM

బాపట్ల జిల్లావ్యాప్తంగా కోడి పందేల బరుల వద్ద భోగి రోజు దాదాపు రూ.70 కోట్లు చేతులు మారాయి. చెరుకుపల్లి మండల పరిధిలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బరిలోనే...

Bapatla District: బరిలోకి.. బాపట్ల

ఇంటర్నెట్ డెస్క్: బాపట్ల జిల్లావ్యాప్తంగా కోడి పందేల బరుల వద్ద భోగి రోజు దాదాపు రూ.70 కోట్లు చేతులు మారాయి. చెరుకుపల్లి మండల పరిధిలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బరిలోనే దాదాపు రూ.30 కోట్ల పందేలు జరిగినపట్లు సమాచారం. పిట్టలవానిపాలెం మండల పరిధిలో పూర్తి హంగులతో బరిని కొలువుదీర్చి భారీగా జూద క్రీడలు నిర్వహించారు. ఇక్కడ రూ.25 కోట్ల వరకూ పందేలు జరిగినట్లు సమాచారం. వేమూరు నియోజకవర్గ పరిధిలో కూడా పెద్దసంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. చెరుకుపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన బరిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పాల్గొన్నారు. పందేల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులకు ఆయనే స్వాగతం పలికారు.

బుల్లెట్‌ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే..

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల పరిధిలో ఏర్పాటు చేసిన బరిలో ప్రత్యేక బహుమతి బుల్లెట్‌ను స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ గెలుచుకున్నారు. పది పందేలకు గాను వరుసగా ఆరుసార్లు ఆయనే విజయం సాధించారు. ఈ పందేల్లో నరేంద్రవర్మతో పాటు ఆయన కుమారుడు కూడా పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య కుమారుడు కూడా ఈ బరి వద్దే కోడి పందేలను వీక్షించారు. ఇదే బరిలో ఇంకో బుల్లెట్‌ను కర్లపాలెం మండలానికి చెందిన ఓ వ్యక్తి గెలుచుకున్నారు. ఇక పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొనకంచివారి పాలెం సమీపంలో, నరసరావుపేట మండలం దొండపాడు వద్ద ఏర్పాటు చేసిన కోడి పందేల బరులు కిటకిటలాడుతున్నాయి. దొండపాడు బరికి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు.

Updated Date - Jan 15 , 2026 | 04:29 AM