వేడెక్కుతున్న కోస్తాంధ్ర!
ABN , Publish Date - May 27 , 2026 | 05:34 AM
దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండ తీవ్రత మొదలైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతల కొత్త రికార్డులు నమోదయ్యాయి. మేలో రెండు వారాలపాటు మోస్తరుగా ఉన్న ఎండలు ఆ తర్వాత తీవ్రరూపం దాల్చాయి.
ఏటేటా పెరిగిపోతున్న వడగాడ్పుల తీవ్రత, వ్యవధి ,వేడిగాలులకు హాట్‌స్పాట్‌లుగా తెలుగు రాష్ట్రాలు
1981తో పోల్చితే 1.04 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత
2050 నాటికి మూడు రెట్లు పెరగనున్న వేడిగాలుల తీవ్రత
ఐఐటీఎం, ఇస్రో, ఏఎస్ఆర్ నిపుణుల అధ్యయనం హెచ్చరిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండ తీవ్రత మొదలైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతల కొత్త రికార్డులు నమోదయ్యాయి. మేలో రెండు వారాలపాటు మోస్తరుగా ఉన్న ఎండలు ఆ తర్వాత తీవ్రరూపం దాల్చాయి. తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తర, మధ్య భారతంలో నెలకొనే తీవ్ర వడగాడ్పులు, వేడి రాత్రులను ఇప్పుడు కోస్తాంధ్రలోనూ ప్రజలు చవిచూస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో వడగాడ్పుల తీవ్రత, ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటువంటి ప్రాంతాల్లో కోస్తాంధ్ర ఒకటిగా గుర్తించారు. దేశంలో 1981 నుంచి 2020 వరకు ఉష్ణోగ్రతలు సగటు కంటే ఒక డిగ్రీ పెరిగినట్టు తేల్చారు. వాతావరణ మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత మరింత పెరగవచ్చని వెల్లడైంది. పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీఎం), హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఘజియాబాద్‌లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్(ఏఎస్ఆర్) శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను ‘నేచుర్’ సంస్థ సైంటిఫిక్ రిపోర్ట్సు జర్నల్‌లో ప్రచురించింది. ఆ నివేదిక మేరకు పసిఫిక్ వేడెక్కడంతో ఏర్పడే ఎల్‌నినో పరిస్థితులు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో 1981 నుంచి 2000 వరకు, మళ్లీ 2001 నుంచి 2020 వరకు వడగాడ్పుల రోజుల సంఖ్య 1.5 రెట్లు పెరిగింది. 2001-2020 మధ్య కోస్తాంధ్రలో వడగాడ్పుల తీవ్రత, వ్యవధి గణనీయంగా పెరిగాయి. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఏటా 8-10 రోజులపాటు వడగాడ్పులు వీస్తున్నాయి.
గతంలో వాయవ్య భారతంతో పోల్చితే ముప్పు తక్కువగా ఉన్న ఏపీ, తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతాలు ఇప్పుడు వడగాడ్పుల హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. 2000 తర్వాత.. ముఖ్యంగా తీర ప్రాంత ఏపీ సహా దక్షిణ భారతంలో వడగాడ్పులు తీవ్రంగా పెరిగాయి. ఉపగ్రహ డేటాను ఉపయోగించి వేడిగాలుల హాట్‌స్పాట్‌లు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని గుర్తించారు. దీర్ఘకాలిక హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఒకటిగా తీర ప్రాంత ఏపీని గుర్తించారు. దేశంలో హాట్‌స్పాట్ ప్రాంతం 11.9 లక్షల చదరపు కిలోమీటర్ల నుంచి 18.1 లక్షల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 1981-2020 మధ్య దేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రత దశాబ్దానికి సుమారు 0.26 డిగ్రీలు చొప్పున 1.04 డిగ్రీలు పెరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, చెట్ల నరికివేత, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు.. అనేక ప్రాంతాల్లో వేడిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. 2050 నాటికి దేశంలో వేడిగాలుల తీవ్రత 2-3 రెట్లు పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వేడి తీవ్రతను తగ్గించడానికి మెరుగైన పట్టణ ప్రణాళిక, పచ్చదనం పెంపు వంటివి చేపట్టాలని పేర్కొన్నారు.