Share News

ఖనిజ భాండాగారంగా ‘ఒంటిల్లు’

ABN , Publish Date - Jul 08 , 2026 | 03:43 AM

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని ఒంటిల్లు బ్లాక్‌లో క్రిటికల్‌, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఖనిజ భాండాగారంగా ‘ఒంటిల్లు’

  • అన్నమయ్య జిల్లాలోని ఒంటిల్లు బ్లాక్‌లో అరుదైన ఖనిజాలు

  • 250 చ.కి.మీ. విస్తీర్ణంలో అన్వేషణకు అనుమతి ఇచ్చిన కేంద్రం

  • కోల్‌ ఇండియాకు దక్కిన టెండర్‌.. ఎక్స్‌ప్లొరేషన్‌ లైసెన్సు మంజూరు

  • ఏడాదిలోపు రాష్ట్ర సర్కారుతో ఒప్పందం.. జీ-3, జీ-4 స్థాయిలో సర్వేలు

మదనపల్లె టౌన్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని ఒంటిల్లు బ్లాక్‌లో క్రిటికల్‌, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒంటిల్లు కేంద్రంగా ఒంటిల్లు-చంద్రగిరి బ్లాక్‌లోని 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మినరల్స్‌ అన్వేషణకు కేంద్ర గనులశాఖ టెండర్‌ నిర్వహించగా ప్రభుత్వ రంగ సంస్థ ‘కోల్‌ ఇండియా’ టెండర్‌ దక్కించుకుంది. దీంతో ఈ సంస్థకు ఎక్స్‌ప్లొరేషన్‌ లైసెన్సు మంజూరు చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌(ఎల్‌వోఐ) అందిన ఏడాదిలోపు మైనింగ్‌ ఒప్పందాలు పూర్తి చేసుకుని, క్షేత్రస్థాయిలో సర్వే పనులను వేగవంతం చేయనున్నారు. కోల్‌ ఇండియా సంస్థ మూడు దశల్లో ఖనిజాన్వేషణ చేయనుంది. ఈ సంస్థ దక్కించుకున్న ఎక్స్‌ప్లొరేషన్‌ లైసెన్స్‌ కింద కేవలం కోర్‌ డ్రిల్లింగ్‌ ద్వారా ఖనిజం ఎంత లోతులో ఉంది.. అని తెలుసుకుంటారు. నేరుగా మైనింగ్‌ తవ్వకాలు చేపట్టరు. 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూగర్భంలో ఎంతలోతున, ఎక్కడెక్కడ ఖనిజాలు లభ్యమవుతాయో గుర్తిస్తారు. దీని కోసం జీ-3, జీ-4 స్థాయిలో భూగర్భ సర్వే చేస్తారు. దీనిలో జియోలాజికల్‌ మ్యాపింగ్‌, సర్వే, కోర్‌ డ్రిల్లింగ్‌ చేస్తారు. ఒంటిల్లు-చంద్రగిరి బ్లాక్‌లోని 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పలుచోట్ల అటవీ ప్రాంతాలు, కొండలు ఉన్నాయి. ఈ సర్వే చేసేందుకు డ్రిల్లింగ్‌ యంత్రాలు నిషేధిత అటవీ ప్రాంతాల్లో తీసుకెళ్లేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల నుంచి స్టేజ్‌-1 ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ తీసుకుంటారు. సర్వే ప్రారంభించే ముందు అన్నమయ్య, తిరుపతి కలెక్టర్ల అనుమతి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల సమక్షంలో సరిహద్దుల గుర్తింపు చేపడతారు. భవిష్యత్‌లో మైనింగ్‌ లీజు ఇవ్వాలంటే మాత్రం ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ నిర్వహించడంతోపాటు, స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది.


24 రకాల మినరల్స్‌

ఒంటిల్లు బ్లాక్‌లో 24 రకాల రేర్‌ ఎర్త్‌, క్రిటికల్‌ మినరల్స్‌ ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తేల్చింది. ముఖ్యంగా రక్షణ రంగానికి ఉపయోగపడే ఖనిజాలు, ఎలకా్ట్రనిక్స్‌ తయారీ, ఎలక్ర్టికల్‌ బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధనానికి ఉపయోగపడే లెడ్‌, జింక్‌, టిటానియం, ఇడిడియం, కాడ్మియం, మెటల్‌ జిర్కాన్‌, సిల్వర్‌ లాంటి ఖనిజాలు ఈ బ్లాక్‌లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే, హోస్ట్‌రాక్స్‌(అతిథి రాతి బండలు)లోని గ్రానైట్‌ పెగ్మటైట్స్‌, కార్బోనటైట్స్‌, చార్నోకైట్‌ శిలాజాలల పొరల్లో ఈ ఖనిజాలు నిక్షిప్తమైనట్లు గుర్తించారు. కాగా, ఖనిజాన్వేషణ ఫలిస్తే అన్నమయ్య జిల్లా ఖనిజ భాండాగారంగా నిలవడమే కాక, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వనరుగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ నిబంధనలు

1) కోల్‌ ఇండియా సంస్థకు లభించిన ఎక్స్‌ప్లొరేషన్‌ లైసెన్సు ప్రకారం 5 సంవత్సరాల్లోపు ఈ ఖనిజాన్వేషణ పూర్తి చేయాలి.

2) తొలి మూడు సంవత్సరాల్లో ఖనిజాన్వేషణ పూర్తయ్యాక మినరల్స్‌ లేవని నిర్ధారించిన ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి.

3) ఖనిజాలు సమృద్ధిగా ఉన్నట్లు తేలిన 25 శాతం విస్తీర్ణంలో(100 చదరపు కిలోమీటర్లు) మిగిలిన రెండేళ్లలో లోతైన ఖనిజాన్వేషణ నిర్వహించాలి.

4) కోల్‌ ఇండియా సంస్థ ఈ బ్లాక్‌లో ఖనిజ లభ్యతను నిర్ధారించాలి.

5) భవిష్యత్‌లో ఇక్కడ చేపట్టే మైనింగ్‌ ద్వారా వచ్చే లాభాల్లో కోల్‌ ఇండియా సంస్థకు 0.5 నుంచి 1శాతం రాయల్టీ చెల్లించాలి.

Updated Date - Jul 08 , 2026 | 03:45 AM