‘శ్రీశైలం ఉద్రిక్తత’పై సీఎంవో ఆరా?
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:05 AM
శ్రీశైలంలో జరిగిన పరిణామాలపై ‘ఉద్రిక్తత వెనుక కుట్రకోణం..?’’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో ముఖ్యమంత్రి కార్యాలయం...
నంద్యాల, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో జరిగిన పరిణామాలపై ‘ఉద్రిక్తత వెనుక కుట్రకోణం..?’’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అప్రమత్తమైంది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ షెరాన్‌కు గురువారం ఉదయం ఫోన్ చేసి దీనిపై సీఎంవో ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై ‘సీఎంవో’ ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగంతో రహస్య విచారణ జరిపిస్తున్నట్టు తెలిసింది. రద్దీ నేపథ్యంలో శివభక్తుల తోపులాట.. పోలీసుల తీరు.. దేవదాయ, అటవీ అధికారుల మధ్య సమన్వయ లోపం.. ఆలస్యంగా శివభక్తులను పాదయాత్రకు అనుమతించడం.. భక్తుల చేతుల్లోకి రాళ్లు రావడం వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా? అనేవైపుగా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. శ్రీశైలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ అక్కడే మకాం వేశారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా పటిష్ఠ బందోబస్తు, తగిన వసతులు, సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. దర్శనాల పరంగా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమన్వయంతో పనిచేయాలని అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.