Share News

సీఎంఓ సీరియస్‌!

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:24 PM

ఆదోనిలో ఇసుక అక్రమ నిల్వలపై సీఎంఓ(ముఖ్యమంత్రి కార్యాలయం) సీరియ్‌సగా స్పందించింది. ఇంత జరగుతున్నా ఏం చేస్తున్నారంటూ మైనింగ్‌, రెవన్యూ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.

సీఎంఓ సీరియస్‌!
ఆదోని బైపాస్‌ రోడ్డులోని ఓ వెంచర్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక

ఆదోనిలో ఇసుక అక్రమ డంప్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా

సమగ్ర నివేదిక ఇవ్వాలని మైనింగ్‌, రెవెన్యూ శాఖలకు ఆదేశం

అధిక ధరలకు విక్రయం.. ఉచిత ఇసుక పాలసీకి తూట్లు

వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి

కర్నూలు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆదోనిలో ఇసుక అక్రమ నిల్వలపై సీఎంఓ(ముఖ్యమంత్రి కార్యాలయం) సీరియ్‌సగా స్పందించింది. ఇంత జరగుతున్నా ఏం చేస్తున్నారంటూ మైనింగ్‌, రెవన్యూ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. అదోనిలో ఇసుక దందాపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎంఓ ఆదేశించింది. అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీ నాయకులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఆదోని నియోజకవర్గంలో అక్రమ ఇసుక డంప్‌ భాగోతాన్ని ‘ఆదోనిలో ఆ నలుగురు..!’ శీర్షిక ఆంధ్రజ్యోతి సోమవారం వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై సీఎంఓ ఆరా తీసింది. ఆదోని తహసీల్దారు శేషఫణి, మైనింగ్‌ విజిలెన్స ఏడీ వెంకటేశ్వర్లును విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఆదివారం సాయంత్రం ఉన్న ఇసుక డంప్‌.. ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో తెల్లారగానే మాయం చేశారు. ఆదోని పట్టణం బైపాస్‌ రోడ్డు సమీపంలో ఆదోని-ఎమ్మిగనూరు ప్రధాన రహదారి పక్కనే ఓ వెంచర్‌లో అక్రమంగా ఇసుక డంప్‌ చేసి.. అక్కడి నుంచి ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కూటమి పార్టీ నేతలతో పాటు వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరికి వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికార కూటమి, ప్రతిపక్ష నాయకులు, నిఘా అధికారులకు నెల వాటాలు అందుతుండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతోంది. వెరసి అధికార పార్టీ నేతలే ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడిచి.. ప్రభుత్వానికి చెడ్డుపేరు తెస్తున్నారు.

ఫ సీఎంఓ సీరియస్‌:

ఆదోని కేంద్రంగా ఇసుక అక్రమ డంప్‌, అధిక రేట్లకు విక్రయాలు, అందుకు సహకరిస్తున్న కూటమి నాయకులు సహా మున్ముందు అడ్డుతగలకుండా ఉండేందుకు వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరికి వాటాలు ఇస్తున్నారు. దీనిపై టీడీపీ యువనేత, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ‘ఆదోనిలో ఆ నలుగురు’ శీర్షికన ఆంధ్రజ్యోతికి వెలుగులోకి తెచ్చింది. ఈ కథనానికి సీఎంఓ సీరియ్‌సగా స్పందించింది. విచారణ చేసిన తక్షణ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. సీఎంఓ ఆదేశాల మేరకు ఆదోని అడ్డాగా సాగుతున్న ఇసుక అక్రమ డంప్‌, అధిక ధరలకు విక్రయాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా మైనింగ్‌ విజిలెన్స ఏడీ వెంకటేశ్వర్లును ఆదేశించారు. అలాగే.. ఆదోని తహసీల్దారు శేషఫణికి సీఎం కార్యాలయం అధికారులు ఫోన చేసి ఆంధ్రజ్యోతి కథనంపై ఆరా తీయడమే కాకుండా, సమగ్ర వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ విషయం తెలిసి కూటమి పార్టీల నాయకుల్లో ఆందోళన మొదలైంది.

ఫ తెల్లారగానే ఇసుక మాయం

ఆదోని పట్టణం ఎమ్మిగనూరు ప్రధాన రహదారి పక్కన, ఆంజనేయస్వామి విగ్రహానికి సమీపంలో ఇసుక అక్రమంగా డంప్‌ చేశారు. తుంగభద్ర నది నుంచి కౌతాళం మండలం నదిచాగి, మరళి ఇసుక రీచల నుంచి ఇసుకను తరలించి, ఈ డంప్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ఇసుక మాఫియా నిర్ణయించిన అనధికారిక ధర చెల్లించిన వారికి సరఫరా చేస్తున్నారు. ఆయా రీచల నుంచి చీకటి పడగానే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఉచిత ఇసుక పాలసీ నిబంధనలు ప్రకారం ఎక్కడా కూడా ఇసుక డంప్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. ఆదోనిలో ఇసుక అక్రమ డంప్‌ను ఆదివారం సాయంత్రం ఆంధ్రజ్యోతి పరిశీలించి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. సోమవారం ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. మైనింగ్‌, రెవిన్యూ, పోలీస్‌ అధికారులు దాడులు చేస్తారేమో అనే భయంతో తెల్లారక ముందే ఆంధ్రజ్యోతి కథనం చూసిన ఇసుక అక్రమార్కులు తెల్లారగానే డంప్‌ నుంచి ఇసుకను మాయం చేశారు. ఇదిలా ఉండగా ఇసుక దందాపై కథనం రావడంతో ట్రాక్టర్‌ డ్రైవర్లు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ డంప్‌ను శాశ్వతంగా మూయించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఫ సీఎం ఆఫీస్‌ అధికారులు విచారణ వాస్తవమే

- శేషఫణి, తహసీల్దారు, ఆదోని

ఆదోని ఇసుక అక్రమ డంప్‌పై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై సీఎంఓ అధికారులు విచారణ చేయడం నిజమే. వాస్తవాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని మైనింగ్‌ విజిలెన్స ఏడీ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లాం. సీఎంఓ ఆదేశాల మేరకు తక్షణమే విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని మైనింగ్‌ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించాం. వారు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక పంపుతామని తెలిపారు.

Updated Date - Jan 12 , 2026 | 11:24 PM