Share News

తుంగభద్ర పనులపై సీఎంవో విచారణ!

ABN , Publish Date - May 14 , 2026 | 04:52 AM

తుంగభద్ర బోర్డు పరిధిలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై సీఎంవో అధికారులు విచారణ చేపట్టారు.

తుంగభద్ర పనులపై సీఎంవో విచారణ!

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

  • చెల్లింపుల ప్రక్రియలో గోల్‌మాల్‌

కర్నూలు, మే 13 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర బోర్డు పరిధిలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై సీఎంవో అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని బోర్డు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. టీబీపీ బోర్డు పర్యవేక్షణలోని తుంగభద్ర దిగువ కాలువ(టీబీపీ ఎల్లెల్సీ) ఆధునికీకరణలో 2023లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన దాదాపు రూ.400 కోట్లు విలువైన వివిధ పనులను 2025-26లో చేపట్టారు. 2022-23, 2023-24, 2024-25లో చేసిన పనులు సహా గతేడాది చేసిన 106 పనులకు రూ.211.47 కోట్ల బిల్లుల చెల్లింపు కోసం టీబీపీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి ఈ నెల 2న లెటర్‌ ఆఫ్‌ ఆథరైజేషన్‌(ఎల్‌వోఏ) జారీ చేశారు. అందులో చేయని పనులు, ఎం బుక్‌ రికార్డు చేయని పనులకు కూడా ఎల్‌వోఏ జారీ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బాగోతంపై ‘చేయని పనులకూ చెల్లింపులా..?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంపై సీఎంవో అధికారులు స్పందించారు. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి.. జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డిని కోరినట్లు తెలిసింది. అయితే.. ఆ పనులు తుంగభద్ర బోర్డు పర్యవేక్షణలో చేపట్టారని, జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షణ ఉండదని వివరించడంతో ఈ విషయాన్ని సీఎంవో అధికారులకు తెలిపారు. దీంతో సీఎంవో ఆధికారులు కర్ణాటక రాష్ట్రం హోస్పెట్‌లోని టీబీపీ బోర్డు అధికారుల నుంచి నివేదిక కోరినట్లు తెలిసింది.


ఎంఎం టైప్‌ క్వార్టర్ల నిర్మాణం పనులు రద్దు చేశాం: ఎస్‌ఈ

కర్నూలు జిల్లా హోళగుంద టీబీపీ ఆర్‌బీ ఎల్లెల్సీ కాలనీలో ఎంఎం టైప్‌ క్వార్టర్ల నిర్మాణం పనులను రద్దు చేశామని, ఎల్‌వోసీ ప్రతిపాదనలో పొరపాటుగా చేర్చామని తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్వార్టర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినా, తరువాత పరిపాలన కారణాల వల్ల రద్దు చేసి 2026-27 వార్షిక ప్రణాళికలో స్పిల్‌ ఓవర్‌ పనుల కింద చేర్చామని వివరించారు. కాగా ఎల్‌వోసీ ప్రతిపాదనలు తయారు చేసే సమయంలో పొరపాటున ఆ పనిని చేర్చామని వివరించడం కొసమెరుపు. బడ్జెట్‌ ఆమోదం కోసం ఎల్‌వోసీ తయారు చేయడం విధానపరమైన ప్రక్రియ అని, ఆ పనులకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని పేర్కొన్నారు. భవిషత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎల్‌వోఏ జారీ చేసినా, పూర్తి చేయని పనులకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు చెల్లించమని తెలిపారు. క్వాలిటీ అధికారులు తనిఖీ ధ్రువపత్రాలు, ప్రీ-ఆడిట్‌ తరువాత నిబంధనల మేరకు పూర్తయిన పనులకే బిల్లులు చెల్లిస్తారని వివరించారు. తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు ఆమోదించిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)కు అనుగుణంగా బోర్డు కార్యదర్శి జారీ చేసిన ఆదేశాల మేరకే చెల్లింపులు చేస్తామని వివరించారు. హరా వంతెన పనులు, యూటీలకు షార్ట్‌క్రీటింగ్‌ పనులు పూర్తయ్యాయని, మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - May 14 , 2026 | 04:52 AM