Share News

వేసవి డిమాండ్‌ను చేరుకునేందుకు సిద్ధం!

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:27 AM

వేసవితోపాటు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను అందుకునేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సీఎం ...

వేసవి డిమాండ్‌ను చేరుకునేందుకు సిద్ధం!

  • గడికోట, అరివేటిపల్లి పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను వేగవంతం చేయండి

  • విద్యుత్తు అధికారులతో సీఎం ప్రత్యేక సీఎస్‌ విజయానంద్‌ సమీక్ష

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): వేసవితోపాటు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను అందుకునేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. బుధవారం విద్యుత్తు సౌధ నుంచి విద్యుత్తు పంపిణీ సంస్థలతోపాటు ఏపీ జెన్కో, నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్‌ మాట్లాడుతూ.. ‘రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలి. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. రోజువారీ డిమాండ్‌ సుమారు 275 మిలియన్‌ యూనిట్లకు చేరింది. రాబోయే 3నెలల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు, ఎల్‌నినో వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పడే విద్యుత్తు అంతరాయాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక, సంసిద్ధత అవసరం’ అని అన్నారు. ఏపీ జెన్‌కో- నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఏంజెల్‌) 5వ బోర్డు సమావేశం కూడా విజయానంద్‌ అధ్యక్షతన జరిగింది. ఏంజెల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. గడికోట, అరివేటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేందుకు అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, డిస్కంల సీఎండీలు పృధ్వీతేజ, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 03:27 AM