CM Chandrababu Naidu: నేడు పోలవరానికి సీఎం
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:00 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పోలవరం ప్రాజెక్టు రానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి.
ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా
పోలవరం/అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పోలవరం ప్రాజెక్టు రానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా.. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగిరంపై వారికి, కాంట్రాక్టు సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. బుధవారం ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు ప్రాజెక్టు హిల్‌వ్యూ ప్రాంతానికి చేరుకుంటారు. తొలుత ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యాం, డయాఫ్రం వాల్, గ్యాప్ 1, 2, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం, కుడి ప్రఽధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 900 మంది పోలీసులు, 150 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందిని మోహరించారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో పోలవరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పనుల్లో 13 శాతం పురోగతి ఉంది. మొత్తంగా ఇప్పటివరకు 87.8 శాతం పనులు పూర్తయ్యాయి.