Share News

కొందరు ఆర్‌డీవోలకు సీఎం బ్రేక్‌!

ABN , Publish Date - Mar 18 , 2026 | 07:05 AM

రాష్ట్రంలో కొందరు ఆర్‌డీవోల బదిలీ, పోస్టింగులను ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నట్టు తెలిసింది. ఆర్‌డీవోలు, డీఎస్పీల పోస్టింగులకు సంబంధించి కడప జిల్లాకు చెందిన...

 కొందరు ఆర్‌డీవోలకు సీఎం బ్రేక్‌!

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ ఫైలు వెనక్కి?

  • 9 మంది ఆర్‌డీవోలు, ఐదుగురు డీఆర్‌వోలకు పోస్టింగులు

  • పనిచేసిన కొన్ని సిఫారసులు

  • భారీగా డిప్యూటీ కలెక్టర్లకూ బదిలీలు

  • హైకోర్టు ఆదేశాలతో ఆ 26 మందికీ అప్రధాన పోస్టులు

  • సీఎస్‌ సాయిప్రసాద్‌ ఉత్తర్వులు

అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొందరు ఆర్‌డీవోల బదిలీ, పోస్టింగులను ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నట్టు తెలిసింది. ఆర్‌డీవోలు, డీఎస్పీల పోస్టింగులకు సంబంధించి కడప జిల్లాకు చెందిన ఓ లాబీయిస్టు బేరసారాలు నడుపుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఖాళీగా ఉన్న అన్ని డివిజన్లకు ఆర్‌డీవోలను నియమించాలని అధికారులు జాబితాలు పంపించగా.. వాటిలో కొన్నింటిపై సీఎం అనుమానం వ్యక్తంచేస్తూ.. చర్చించాలని రాసి ఫైలును వెనక్కి పంపించినట్టు తెలిసింది. ఇంకోవైపు 9 మంది ఆర్‌డీవోలు, ఐదుగురు జిల్లా రెవెన్యూ అధికారు(డీఆర్‌వో)లను రాష్ట్రప్రభుత్వం మంగళవారం బదిలీ చేసి పోస్టింగులిచ్చింది. సీఎస్‌ సాయిప్రసాద్‌ ఈ మేరకు జీవో 583ని జారీచేశారు. డీఆర్‌వో కె.మల్లికార్జునుడు కడప జిల్లాకు బదిలీ కాగా.. ఎం.విశ్వేశ్వరనాయుడు విశాఖకు, వి.విశ్వేశ్వరరావు-ఏలూరు, ఎం.నూకరాజు-అల్లూరి జిల్లా, కె.పద్మలత పశ్చిమగోదావరికి బదిలీ అయ్యారు. ఆర్‌డీవోల్లో కె.వెంకటశివ.. ఆత్మకూరు(నంద్యాల)కు, సనపాల సుధాసాగర్‌-విజయనగరం, కాకర ఆనంద్‌రావు-కొవ్వూరు, బి.శ్రీదేవి-రేపల్లె, ఎస్‌.ప్రేమ్‌నాధ్‌కుమార్‌-ధర్మవ రం, ఎ.కుమార్‌-తిరువూరు, ఎ.మురళి-కడప, డి.ఎలిషా-కావలి, కె.బాలకృష్ణ నరసరావుపేటకు నియమితులయ్యారు. వీటిలో కొన్ని బదిలీల్లో సిఫారసులే బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇచ్చిన సిఫారసు లేఖల ఆధారంగా ఎంపికలు చేసినట్లు సమాచారం. ఇందులో కడప లాబీయిస్టు నడిపిన మంత్రాంగంతో ఇద్దరికి పోస్టింగులు దక్కినట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో కీలక పోస్టు దక్కించుకున్న అధికారి.. అక్రమ మద్యం కేసులో అరెస్టయిన రిటైర్డ్‌ అధికారికి అత్యంత సన్నిహితుడు.. శిష్యుడన్న పేరు ఉంది. ఆయన్ను ఆ ప్రాంత ప్రజాప్రతినిధి ద్వారా సిఫారసు చేయించి ఆ పోస్టింగ్‌ ఇప్పించినట్లు తెలిసింది. రాయలసీమలో మరో కీలకమైన పోస్టు కూడా లాబీయిస్టు చలవతోనే ఓ అధికారికి దక్కిందని చర్చ జరుగుతోంది. బదిలీల్లో తెనాలి ప్రాంతానికి చెందిన ఓ ఎన్నారై పాత్ర స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సూచించిన ముగ్గురికి కీలక పోస్టులు దక్కినట్లు తెలిసింది.


ఆ 26 మంది మళ్లీ బదిలీ..

రాష్ట్రప్రభుత్వం భారీగా డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీచేసింది. వీరిలో గ్రూప్‌-1 పరీక్షల వివాదానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే బదిలీ అయిన 26 మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా ఉన్నారు. గత నెల 26న ఈ 26 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే అప్రధాన పోస్టుల్లో నియమించాలని తాము ఆదేశిస్తే.. వారిని కీలక పదవుల్లో నియమించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ నేపఽథ్యంలో ఆ 26 మందిని మళ్లీ అంతగా ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీచేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

Updated Date - Mar 18 , 2026 | 07:06 AM