Share News

AP CM Chandrababu Naidu: నల్లమల సాగర్‌పై ముందుకే..

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:06 AM

పోలవరం - నల్లమల సాగర్‌ అనుసంధాన పథకంపై ముందుకే వెళదామని జల వనరుల శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

AP CM Chandrababu Naidu: నల్లమల సాగర్‌పై ముందుకే..

  • కేంద్ర జల సంఘం అనుమతి సాధించండి

  • కృష్ణా వరద జలాలతో సీమ సస్యశ్యామలం

  • తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే వైఖరే

  • ఏడాదిలోగా పూర్వోదయ కింద ఉత్తరాంధ్ర స్కీమ్‌లు పూర్తి: సీఎం

అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం - నల్లమల సాగర్‌ అనుసంధాన పథకంపై ముందుకే వెళదామని జల వనరుల శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దామన్నారు. దావోస్‌కు వెళ్లే ముందు శనివారం రాత్రి అమరావతి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ‘‘నల్లమలసాగర్‌ విషయంలో కేంద్రంతో మాట్లాడి అనుమతి సాధించాలి. పొరుగుదేశం తెలంగాణతో సంప్రదింపులు జరపాలి. వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందేలా సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. వృఽథాగా పోయే జలాలను వాడుకునేలా నల్లమలసాగర్‌ ప్రాజెక్టును రూపొందించాం. దీనిపై కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు పొరుగు రాష్ట్రం నుంచి కూడా అభ్యంతరం రాకుండా చూసుకోవాలి. అవసరమైన పక్షంలో తెలంగాణాకూ నీటిని అందించేలా మన ప్రణాళికలు ఉండాలి’’ అని సీఎం నిర్దేశించారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మారుద్దామని, ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ..సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. పూర్వోదయ పథకం కింద ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలోనే తాను వెలిగొండ ప్రాంతాన్ని సందర్శిస్తానని తెలిపారు. ప్రాధాన్యాలవారీగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని జల వనరుల శాఖను ఆదేశించారు. కేంద్రం నిధులు మంజూరు చేసే పూర్వోదయ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పీపీపీ విధానంలో చేపట్టే పథకాలపై సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. దావోస్‌ పర్యటనల నుంచి తిరిగి రాగానే ఆ జాబితాను తనకు సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని కోరారు. ‘‘గత ఏడాది హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులకు గడువు నిర్దేశించుకుని పూర్తి చేశాం. పోలవరం ప్రాజెక్టు పనులనూ పరుగులు పెట్టిస్తున్నాం. ఇదే తరహాలో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయాలి.’’ అంటూ దిశానిర్దేశం చేశారు. రాయలసీమలో పూర్వోదయ పథకం కింద ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. ఈ పథకం కింద ప్రకాశం, రాయలసీమలోని తొమ్మిది జిల్లాలను అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ ప్రాజెక్టులను చేపడితే ఉద్యాన రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది రెండు లక్షల హెక్టార్లలో ఉద్యాన వన పంటలు పండించేలా రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. ఇక పథకంలో భాగంగా చేపట్టాల్సిన రోడ్‌ నెట్‌వర్క్‌, లాజిస్టిక్స్‌ కనెక్టివిటీ, వేర్‌ హౌసింగ్‌ సదుపాయాలు, కోల్డ్‌ చెయిన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆయా శాఖల్లో చేపట్టాల్సిన పనులను జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. నల్లమల సాగర్‌తోపాటు ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో పీపీపీ ప్రాజెక్టులు, వివిధ శాఖల్లోని జల జీవన్‌ మిషన్‌, సాస్కీ నిధుల వినియోగం వంటి అంశాలపైనా సీఎం సమీక్షించారు.


చెరువులను నింపాలి

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చూపేందుకు వీల్లేదని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులను పూర్తిచేయడం, రాష్ట్రంలోని చెరువులను నింపడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. సుమారు 200 ప్రాజెక్టులు మొదటి విడతలో పీపీపీ కింద చేపట్టాల్సిన అవసరం ఉన్నదని, జల్‌జీవన్‌ మిషన్‌ 2027 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 04:06 AM