Share News

‘జీరో పావర్టీ’ లక్ష్యం

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:57 AM

రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

‘జీరో పావర్టీ’ లక్ష్యం

  • పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి: చంద్రబాబు

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సెర్ప్‌, మెప్మా, ఆర్టీజీఎస్‌ విభాగాలతో జీరో పావర్టీ మిషన్‌ కుటుంబ సాధికారతపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు సూచించారు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) సంస్థలు సెర్ప్‌, మెప్మా, ఆర్టీజీఎస్‌ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ వ్యవస్థల నెట్‌వర్క్‌ ద్వారా 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తుమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలన్నారు. 2047 స్వర్ణాంధ్ర మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా ఈ మిషన్‌ను చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్న రూ.1,100 కోట్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. జాతీయ అర్బన్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ ద్వారా పట్టణ ప్రాంతాల్లోనూ పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.


ప్రభుత్వ పథకాలు, పీ4 విధానం స్వయం సహాయక సంఘాల సహకారంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని మార్గదర్శి-బంగారు కుటుంబం ఎంబీకే 10-20గా పిలవాలని సూచించారు. సమాజంలో అట్టడుగున ఉన్న 20శాతం మందిని ఆర్థికంగా ఎగువన ఉన్న 10శాతం స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పేదరికం నుంచి బయటపడిన వారికి గౌరవప్రదమైన పేరును ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలును వ్యక్తిగతంగా కాకుండా ఫ్యామిలీ యూనిట్‌గా పరిగణించాలన్నారు. సమీక్షలో సీఎం ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూ్‌షకుమార్‌, సెర్ప్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 03:58 AM