Share News

ఇలాగైతే మిమ్మల్ని మోయలేం!

ABN , Publish Date - May 22 , 2026 | 04:22 AM

‘ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకుంటే ఫలితం ఉండదు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలే దీనికి నిదర్శనం.

ఇలాగైతే మిమ్మల్ని మోయలేం!

  • మాట వినని ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పిన చంద్రబాబు

  • గ్రేస్‌ పీరియడ్‌ కూడా ముగిసింది!

  • రెండేళ్లుగా చెబుతూ వస్తున్నా

  • ఇక చెప్పడం ఉండదు.. చేతలే!

  • ప్రభుత్వం ఎంత చేసినా.. మీ పనితీరు సరిగా లేకుంటే ఫలితం ఉండదు

  • తమిళనాడు ఫలితాలే నిదర్శనం

  • పొలిట్‌బ్యూరో భేటీలో సీఎం స్పష్టీకరణ

  • ఈసారి మహానాడులో మహిళకే పెద్దపీట

ఇటీవల కావలి పర్యటన సమయంలో స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని కార్యకర్తల ఎదుటే స్పష్టంగా చెప్పాను. ఇకనైనా పనితీరు మార్చుకుంటే సరి. లేకుంటే చెప్పడాలు.. బుజ్జగించడాలు ఉండవు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలి. జనాభాలో 50 శాతమున్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నుదన్నుగా ఉన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని మహానాడు వేదికగా మరోసారి స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

- చంద్రబాబు

అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకుంటే ఫలితం ఉండదు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలే దీనికి నిదర్శనం. రెండేళ్లుగా పదే పదే ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోమని చెబుతూ వస్తున్నాను.. ఇక చెప్పడం ఉండదు. చేతలే..! మాట వినని ఎమ్మెల్యేలను పార్టీ మోయదు’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా గురువారం పొలిట్‌బ్యూరో సమావేశాన్ని వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి చంద్రబాబు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ పాల్గొనగా.. వేర్వేరు ప్రదేశాల నుంచి మిగిలిన 27 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఇటీవలి ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయి. బెంగాల్లో శాంతిభద్రతల వైఫల్యం తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధిపరంగా బాగాచేసినా ఎమ్మెల్యేల అవినీతి ఆ పార్టీ ఓటమికి కారణమైంది.


కేరళలో లెఫ్ట్‌ కూటమి ఓటమికి అవినీతి.. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత ప్రధాన కారణాలుగా నిలిచాయి. వీటిని అర్థం చేసుకుని మన పనితీరును చక్కదిద్దుకుంటే 2029 ఎన్నికల్లో మన గెలుపును ఎవ్వరూ ఆపలేరు’ అని తేల్చిచెప్పారు. పార్టీ లైన్‌ దాటి పనిచేసే వారు తమను తాము సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని.. అలాంటి వారిని ఉపేక్షించే ప్రశ్నే లేదన్నారు. తప్పు చేసినా మిమ్మల్ని మోస్తానని మాత్రం అనుకోవద్దన్నారు.


స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు..

ఈసారి మహానాడును స్త్రీశక్తి థీమ్‌తో నిర్వహించాలని, మహిళలకే పెద్దపీట వేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకు, మహిళా సాధికారతకు, వారికి హక్కులు కల్పించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో విశదీకరించాలని సీఎం సూచించారు. ప్రతి పథకంలోనూ మహిళలను భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మహానాడు నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఏయే తీర్మానాలు ప్రవేశపెట్టాలి.. వాటి సారాంశం ఏ విధంగా ఉండాలి వంటి అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మొత్తంగా 20 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్‌ నుంచి 1.. మరో 4 ఉమ్మడి తీర్మానాలు, కీలక రాజకీయ తీర్మానం చేపడతారు. వీటితోపాటు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులపై కూలంకషంగా చర్చించాలని సీఎం ఆదేశించారు. ‘నా దేశం.. నా బాధ్యత’ పేరుతో పొదుపు చర్యలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేకంగా చర్చజరపాలని సూచించారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలను, కుట్రలను బహిర్గతం చేయడంతోపాటు ప్రజల్లో అవగాహన పెంచేలా ఉండాలని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. తెలుగుదేశం చరిత్ర, ఎన్టీఆర్‌ సిద్ధాంతాలు నేటి తరానికి తెలిసేలా మహానాడులో ప్రజెంటేషన్స్‌ ఇవ్వనున్నారు. అన్ని క్టస్లర్లలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టి మహానాడును ప్రారంభించాలని నిర్ణయించారు.


వక్తలు సమయ పాలన పాటించాల్సిందే..

ఈసారి మహానాడు హైబ్రిడ్‌ విధానంలో జరుగుతున్నా.. దాని స్ఫూర్తి మాత్రం కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని పండుగలా చేపట్టాలన్నారు. రెండ్రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని.. అగ్రనాయకత్వం మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు భాగస్వాములను చేయాలన్నారు. ‘ఉదయం 9గంటలకు ఠంచనుగా ప్రారంభించి సాయంత్రం 5కు ముగించాలి. వక్తలు సమయపాలన తప్పనిసరిగా పాటించేలా చూడాలి. శుక్రవారం నుంచే పార్టీ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, మహానాడు నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించాలి. కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో ప్రతిఫలించాలి’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. మండల స్థాయిలో మహానాడు నిర్వహిస్తే సరిపోతుందని కొందరు చేసిన సూచనను ఆయన తోసిపుచ్చారు. క్లస్టర్‌ స్థాయిలో నిర్వహిస్తేనే కార్యకర్తల్లో జోష్‌ ఉంటుందన్నారు.

Updated Date - May 22 , 2026 | 05:58 AM