పద్ధతి మార్చుకోకపోతే పక్కన పెడతా!
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:15 AM
పదవులు ఉన్నాయి కదా అని విర్రవీగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరులో బుధవారం నిర్వహించిన కార్యకర్తల...
పదవులున్నాయని విర్రవీగితే ఉపేక్షించను
కార్యకర్తల భేటీలో చంద్రబాబు స్పష్టీకరణ
నెల్లూరు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : పదవులు ఉన్నాయి కదా అని విర్రవీగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరులో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఉదయగిరి నియోజకవర్గ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కొందరు నాయకుల తీరుపై తీవ్ర స్వరం వినిపించారు. ‘‘స్థానిక ఎమ్మెల్యే (ఉదయగిరి) కాకర్ల సురేశ్ మరింత మెరుగుపడాలి. ఎవరికి వారు తమ పనితీరుపై దృష్టి పెట్టాలి. మీ గురించిన నివేదికలు ఎప్పటికప్పుడు నాకు చేరుతున్నాయి. ఈ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ రోజు రోజుకు దిగజారుతోంది. దీనికిఎమ్మెల్యే కారణమా? లేదా నాయకుల వైఫల్యమా? అనేది మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ, మూడు నెలల్లో పనితీరులో మార్పు రావాలి. లేదంటే నిర్దాక్షిణ్యంగా పదవులను పక్కన పెట్టాల్సివస్తుంది. ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తలే నాకు ముఖ్యం.’’ అని చంద్రబాబు తేల్చి చెప్పారు.