గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వం
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:42 AM
‘రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉంది. వారికి తెలిసింది ఒక్కటే విధ్వంసం చేయడం.. కూల్చడం.. నరకడం. పోస్టర్లకు నరబలి ఇస్తారు. అంటే దేనికి సంకేతం.
నరకడాలు, కూల్చడాలు చేస్తే వదిలిపెట్టం: చంద్రబాబు
ఇక్కడున్నది సీబీఎన్ 95.. అప్పుడెంత దూకుడుగా ఉన్నానో ఇప్పుడూ అంతే..
రాజకీయాల్లోకి సేవ చేసే పార్టీలు రావాలి
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతి ఒక్కరి బాధ్యత
పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి
అమరావతి రైతులు రెండోసారీ ఇంకో 17 వేల ఎకరాలిచ్చారు
నిడదవోలులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ
అందరిలో బాధ్యత ఉండాలి. జపాన్‌లో ఎక్కడా స్వీపర్లు ఉండరు. రోడ్డుపై ఒక్క కాగితం కనిపించదు. ఎక్కడైనా కాగితం కనిపిస్తే ఎవరు ముందు చూస్తే వాళ్లు ఆ కాగితాన్ని పర్సులో పెట్టుకెళ్లి ఇంటి దగ్గర ఉన్న డస్ట్ బిన్‌లో వేస్తారు. ఆ స్ఫూర్తి ఇక్కడా రావాలి.
- ముఖ్యమంత్రి
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉంది. వారికి తెలిసింది ఒక్కటే విధ్వంసం చేయడం.. కూల్చడం.. నరకడం. పోస్టర్లకు నరబలి ఇస్తారు. అంటే దేనికి సంకేతం. అందరినీ నరుకుతామనా? ఇక్కడున్నది సీబీఎన్ 95. నేను తొలిసారి 1995లో సీఎం అయ్యా.. అప్పుడు ఎంత దూకుడుగా ఉండేవాడినో.. ఇప్పుడూ అంతే.. సేమ్ టూ సేమ్.. ఏ మాత్రం తగ్గలేదు.. జాగ్రత్తగా ఉండాలి’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోదీ. ఇంకోపక్క మా మిత్రుడు పవన్ కల్యాణ్.. నరకడాలు కాదు.. కూల్చడాలు చేసినా ఎవ్వరినీ వదలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇలాంటి పార్టీల వల్ల లాభంలేదని.. ప్రజలకు సేవచేసే పార్టీలు రావాలని పిలుపిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. మాలకోడులోని రూ.5.5 కోట్లతో నిర్మించే మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ), చెరువు సుందరీకరణ, రాష్ట్రవ్యాప్తంగా రూ.1,025 కోట్లతో నిర్మించే ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ‘సీఎంగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించబోతున్నాను. ఇది నా అదృష్టం. పోలవరం ప్రాజెక్టు జాతికి వరం. అలాంటి ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ను గత ప్రభుత్వం గోదావరిలో కలిపేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో దీనిని పూర్తి చేశాం.
ఏపీకి శాశ్వత రాజధాని అమరావతి అని కేంద్రం చట్టబద్ధత కల్పించింది. రైతులు భూసమీకరణలో రాజధానికి తొలుత 33 వేల ఎకరాలిచ్చారు. మళ్లీ నేనిచ్చిన పిలుపుతో రెండోసారి 17వేల ఎకరాలను నిన్న స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇదీ రైతులకు ఈ ప్రభుత్వంపైన నమ్మకం. గొడ్డలి పార్టీ వాళ్లకు పేదోడికి కడుపునిండా తిండిపెట్టే మనసు ఉండదు. అన్న క్యాంటీన్లు మూసేశారు. నిమ్మల స్వచ్ఛందంగా అన్న క్యాంటీన్లు తెరిస్తే.. నువ్వు పేదవాడికి భోజనం పెట్టడానికి వీల్లేదంటూ మూసివేసి ఆయనపై కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 269 అన్న క్యాంటీన్లు తెరిచాం. పేదవాడికి కడుపునిండా తిండిపెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా.. ఒకటే లేకపోయినా ఒకటే’ అని స్పష్టంచేశారు.
డోర్ టూ డోర్ చెత్తసేకరణ
రాష్ట్రంలో రోజూ 7,527 టన్నుల ఉత్పత్తి అవుతోందని.. 153 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని సీఎం చెప్పారు. ఇందులో 114 టన్నులు తీసేశామని.. మిగిలింది కూడా నూటికి నూరుశాతం తీసేస్తామని హామీఇచ్చారు. డోర్ టు డోర్ చెత్త సేకరిస్తున్నామన్నారు. ‘పట్టణాల్లో 97శాతం చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పెంచుతున్నాం.రాష్ట్రమంతా నూటికి నూరుశాతం చెత్త సేకరించే బాధ్యత ఈ ప్రభుత్వం, స్థానిక సంస్థలు తీసుకుంటాయి. ఈ చెత్తను తరలించేందుకు రూ.603 కోట్లతో ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ అక్టోబరు నాటికి పనిచేస్తాయి. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి. ఈ ఏడాది డిసెంబరు నాటికి 7 లక్షల 14 వేల కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. లక్ష ఇంకుడు గుంతలు, 8వేల సామాజిక ఇంకుడు గుంతలు తవ్వుతాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించిన మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మిస్తున్నాం. 13నగరాల్లో స్వీపింగ్ యంత్రాలు పెట్టేందుకు టెండర్లు పిలిచాం. చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేయడానికి 8 ప్లాంట్లు పెడుతున్నాం. ఇంకోపక్క గ్రీన్ కవర్ కూడా(పచ్చదనం) 31.33 శాతం ఉంది. ఇది 2030నాటికి 37 శాతం చేయాలి. 2047కి 50శాతం రావాలి. ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా కింద 63 లక్షల మందికి పింఛన్లు రూ.33వేల కోట్లు ఇస్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తక్కువ వస్తున్నాయి. దానికి కారణం ఇక్కడ వరి వేస్తారు. భూముల ఖరీదు ఎక్కువ. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. భవిష్యత్‌లో 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి’ అని తెలిపారు. వేదికపై సీఎం పారిశుధ్య కార్మికులతో కలిసి కూర్చున్నారు. నిడదవోలు మునిసిపాలిటీలో పనిచేస్తున్న నాగేశ్వరరావు, రాణిని తనకు ఇరువైపులా సభ పూర్తయ్యే వరకూ కూర్చోబెట్టుకున్నా రు. వారి యోగక్షేమాలపై ఆరా తీశారు. చివరిగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
బాగా పనిచేస్తే శభాష్..
‘అధికారులు బాగా పనిచేస్తే శభాష్ అని భుజం తడుతున్నాను. చేయకపోతే పద్ధతి మార్చుకోమని చెబుతున్నా. మారకపోతే మాత్రం వదలిపెట్టను’ అని చంద్రబాబు చెప్పారు. నూటికి 90 శాతం అధికారులు బాగా పనిచేస్తున్నారని.. వారి పనితీరు డేటా తనవద్ద ఉందన్నారు. ఈ సభా వేదిక ద్వారా పర్యాటక మంత్రి దుర్గేశ్.. స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
1080 మందితో ఫొటోలు
నిడదవోలులో టీడీపీ కార్యకర్తల సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడారు. ‘మిమ్మల్ని ఏ రోజూ వదిలిపెట్టలేదు. కార్యకర్తలు నా ప్రాణం, పార్టీ బలోపేతానికి వారు అండగా ఉంటూ కృషి చేయాలి. భారీ స్థాయిలో కార్యకర్తలు కలిగిన పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తా. మీ అందరి బాధ్యతా నాది’ అని స్పష్టం చేశారు. సమావేశానికి హాజరైన 1080 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు ఫొటోలు దిగారు.