Share News

వైసీపీ కుట్రలతో జాగ్రత్త

ABN , Publish Date - Jul 24 , 2026 | 04:27 AM

గొడ్డలి పార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాబినెట్‌ సమావేశంలో మంత్రులకు సీఎం సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న నీట్‌ ఆందోళనలతో మెగా డీఎస్సీని ముడిపెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని..

వైసీపీ కుట్రలతో జాగ్రత్త

  • వివాదాల సృష్టే దాని నైజం: చంద్రబాబు

  • మెగా డీఎస్సీని నీట్‌తో ముడిపెట్టి రచ్చ చేయాలని చూస్తున్నారు

  • మనం మరింత క్రియాశీలంగా ఉండాలి

  • చేసింది చెప్పడంలో విఫలమవుతున్నారు

  • చాలా విషయాల్లో మంత్రుల వెనుకబాటు

  • రెండేళ్ల విజయాలపై ప్రెస్‌మీట్లు పెట్టి చేతులు దులుపుకొన్నారు.. సీఎం క్లాస్‌!

అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాబినెట్‌ సమావేశంలో మంత్రులకు సీఎం సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న నీట్‌ ఆందోళనలతో మెగా డీఎస్సీని ముడిపెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రులు తన దృష్టికి తీసుకురాగా.. వివాదాలు సృష్టించడమే గొడ్డలి పార్టీ నైజమని ఆయన అన్నారు. ‘డీఎస్సీ పరీక్షల వ్యవహారంలో వైసీపీ వాళ్లు చెప్పింది జనం నమ్మలేదు.. చివరకు కోర్డుకు వెళ్లినా సక్సెస్‌ కాలేకపోయారు. దీంతో ఢిల్లీలో పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చారు. నీట్‌ పరీక్షతో ముడిపెట్టి రచ్చ చేయాలని చూస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలాసలో రోడ్డు ప్రమాద ఘటన, టీటీడీ ఆంజనేయస్వామి విగ్రహ చోరీ నిందితులను సీసీటీవీలు పట్టించిన తీరును మంత్రులకు వివరించారు. వైసీపీ నేతలు లేని వివాదాలను సృష్టించాలని చూస్తుంటారని, వారి చర్యల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొగాకు ధరల అంశాన్ని వివాదం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రులు చెప్పగా.. వారి నైజమే అదని ఆయన అన్నారు. ‘మనం మరింత క్రియాశీలంగా ఉండాలి. మనం ఏం చేశామో ముందే చెబితే ప్రతిపక్షానికి విమర్శించే అవకాశం ఉండదు కదా! మంత్రులు చాలా విషయాల్లో వెనుకబడిపోతున్నారు. ఎస్‌ఐపీబీ ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా స్థాయిలో చర్చించాలని నేను ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదు. డీఆర్సీ, ప్లానింగ్‌ బోర్డు సమావేశాలనూ సరిగా నిర్వహించడం లేదు. మంత్రి, కలెక్టర్‌ ఇద్దరూ కలిసి క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలి.


నేను సీరియ్‌స్‌గా పర్యవేక్షిస్తా. రెండేళ్ల విజయాలపై మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి చేతులు దులుపుకొన్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డారు. తల్లికి వందనం, మెగా పీటీఎం, నేతన్నల సేవలో, పేదల సేవలో లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నా జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. చేసింది చెప్పుకోలేకపోవడం మన ప్రధాన వైఫల్యం. రైతుల కోసం పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం చేశాం. నేను వారి వద్దకు వెళ్లినప్పుడు.. ఈ కార్యక్రమం జరిగిందా.. ఎమ్మెల్యేలు వచ్చారా అని ప్రశ్నిస్తే ఎవ్వరూ రాలేదని సమాధానం వచ్చింది. ఇలాగైతే కార్యక్రమాలు నిర్వహించి ఉపయోగం ఏమిటి’ అని చంద్రబాబు ప్రశ్నించారు. మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీకి లోకేశ్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, గంటల తరబడి నిలబడి ప్రతి ఒక్కరికీ స్వయంగా పట్టాలు పంపిణీ చేశారని ప్రశంసించారు. అన్ని చోట్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలపై ప్రతి నెలా రెండో క్యాబినెట్‌ భేటీలో సమీక్షిస్తానని, మంత్రులు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Jul 24 , 2026 | 04:29 AM