Share News

మహాద్వారాన్ని కాదని.. సాధారణ భక్తుడిలా..!

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:24 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తిరుమలలో కుటుంబ సమేతంగా పర్యటించారు. మనవడు దేవాంశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆయన..

మహాద్వారాన్ని కాదని..  సాధారణ భక్తుడిలా..!

  • శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

  • మనవడు దేవాంశ్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో తిరుమలకు

  • ఒక రోజు అన్న ప్రసాద వితరణ

తిరుమల, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తిరుమలలో కుటుంబ సమేతంగా పర్యటించారు. మనవడు దేవాంశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆయన.. శనివారం ఉదయం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, మనవడు దేవాంశ్‌, మరదలు ఇందిర, సోదరి కుమార్తె భర్త దిలీప్‌తో కలిసి సంప్రదాయ వస్త్రధారణ, నుదుట తిరునామంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయన మహద్వారం నుంచి లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అయినా.. ఎప్పటిలానే సామాన్య భక్తుడిలా క్యూలైన్‌ ద్వారా మహద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకబృందం, టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన సీఎం.. ధ్వజస్తంభానికి నమస్కరించారు. తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, జీయర్‌స్వాములు ఆయనతో శ్రీవారి శేషవస్ర్తాన్ని ధరింపజేశారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని ఆలయ ప్రదక్షణగా వచ్చి విమానవేంకటేశ్వరస్వామిని, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని సీఎం దర్శించుకున్నారు. హుండీలో కానుకలు వేసి రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పంచాంగం తదితరాలను అందజేశారు.


స్వయంగా వడ్డించి

మనవడు దేవాంశ్‌ పుట్టిన రోజునాడు తిరుమలలో అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం విరాళంగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటివరకు 12 సార్లు విరాళాన్ని అందజేశారు. తాజాగా శనివారం ‘ఒకరోజు అన్నప్రసాద వితరణ స్కీం’కు రూ.44 లక్షలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. అక్కడ మనవడు దేవాంశ్‌, కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం చంద్రబాబు కూడా సతీమణి, మనవడు, కుమారుడు మంత్రి లోకేశ్‌తో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు.

Untitled-2 copy.jpg

భక్తులతో మమేకం

సీఎం చంద్రబాబు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ శ్రీవారి భక్తులను ఆప్యాయంగా పలకరించారు. అన్నప్రసాద భవనం నుంచి అతిథిగృహం వద్దకు కాన్వాయ్‌లో వెళుతున్న సమయంలో లేపాక్షి సర్కిల్‌ వద్ద భక్తులు భారీగా ఉండటాన్ని గమనించిన సీఎం వాహనం దిగి వారి వద్దకు వెళ్లారు. కరచాలనం చేస్తూ ఫొటోలు దిగారు. స్థానిక మహిళ ఇచ్చిన కరుంగళి మాలను స్వీకరించి ధరించారు. కొందరు చిన్నారులను ఎత్తుకుని ఫొటోలు దిగిన సీఎం.. మరికొందరు భక్తులతో టీటీడీ సౌకర్యాలపై ఆరా తీశారు. లడ్డూ ప్రసాదాలు ఎలా ఉన్నాయని అడిగారు. దీనికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయని భక్తులు ముక్తకంఠంతో తెలిపారు. మరికొంతమంది దర్శనం వేగంగా జరిగేలా చూడాలని కోరగా, సీఎం స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఇప్పటికే ఏర్పాటు చేశామని, త్వరలోనే ఏఐ టెక్నాలజీ ద్వారా మరింత త్వరగా దర్శనం అయ్యేలా చూస్తామని చెప్పారు.

Untitled-2 copy.jpg

పొంగలిని పంచుకున్నారు!

వెంగమాంబ సత్రంలో భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించిన అనంతరం సీఎం దంపతులు కూడా సాధారణ భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ క్రమంలో సిబ్బంది సీఎం చంద్రబాబుకు పొంగలి అధికంగా వడ్డించడాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి గమనించారు. దీంతో ‘కొంచెం నాకు పెట్టండి’ అని ఆమె చెప్పడంతో చంద్రబాబు తన విస్తరిలోని పొంగలిని సతీమణి భువనేశ్వరితో పంచుకున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 06:27 AM