Share News

డిప్యూటీ సీఎం నివాసానికి ముఖ్యమంత్రి

ABN , Publish Date - May 03 , 2026 | 04:01 AM

శస్త్ర చికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల డిప్యూటీ సీఎం హైదరాబాద్‌లో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

డిప్యూటీ సీఎం నివాసానికి ముఖ్యమంత్రి

  • శస్త్ర చికిత్స అనంతరం పవన్‌కు బాబు పరామర్శ

  • ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించిన వైద్యులు

  • తగిన విశ్రాంతి తీసుకొని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): శస్త్ర చికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల డిప్యూటీ సీఎం హైదరాబాద్‌లో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు, పవన్‌ నివాసానికి వెళ్లారు. చంద్రబాబుకు, పవన్‌, ఆయన సతీమణి అనా సాదరంగా స్వాగతం పలికారు. పవన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి వాకబు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ తనకు జరిగిన శస్త్రచికిత్స వివరాలను బాబుకు వివరించారు. ‘సైన్‌సను అశ్రద్ధ చేయడంతో తీవ్ర సమస్యగా పరిణమించి కంటిపై ప్రభావం చూపింది. వైద్యులు తక్షణ చికిత్స అవసరమంటూ ఫంక్షనల్‌ ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ(ఫేస్‌) చేశారు. సర్జరీ తరువాత ఇప్పటికీ ముక్కు వెంబడి కొద్దిపాటి రక్తస్రావం ఉంది. మరో వారం రోజుల్లో సర్దుకుంటుందని వైద్యులు తెలిపారు. సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల్లో తగిలిన గాయాలను అప్పుడు పట్టించుకోలేదు. అవి ఇప్పుడు బాధిస్తున్నాయి’ అని పవన్‌ వివరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైద్యులు... ‘పవన్‌ కల్యాన్‌కు భుజం దగ్గర మజిల్‌కు ఐదేళ్ల క్రితమే గాయం అయింది. రోటేటర్‌ కఫ్‌ ఇంజురీ ఉంది. అప్పుడు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది తలెత్తింది. దీనికి శస్త్ర చికిత్స అవసరం’ అని తెలిపారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ... ‘ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వైద్యుల సూచనలు పాటించడం తప్పనిసరి. శస్త్రచికిత్స అనంతరం శాఖాపరమైన రివ్యూలు, ఫైల్స్‌ పరిశీలనకు కొంత సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయంలోనే చేయండి’ అని సూచించారు. తగిన విశ్రాంతి తీసుకొని, పవన్‌ పూర్తి స్వస్థత పొందాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Updated Date - May 03 , 2026 | 04:02 AM