నేడు వెలిగొండకు సీఎం
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:33 AM
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాక.. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి ఇక్కడకు రానున్నారు.
ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన
అనంతరం మార్కాపురంలో బహిరంగ సభ
కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత..చంద్రబాబు రావడం ఇదే తొలిసారి
మార్కాపురం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాక.. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి ఇక్కడకు రానున్నారు. బుధవారం బహిరంగ సభలో పాల్గొననున్నారు. అంతకుముందు ఆయన దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేయకుండానే జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించింది. కనీసం ఫీడర్ కాలువ పటిష్ఠతపై కూడా దృష్టిపెట్టకపోవడంతో పలుచోట్ల గండ్లుపడి కట్టలు తెగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్లు మంజూరు చేసింది. షెడ్యూల్ ప్రకారం సీఎం మధ్యాహ్నం 12.40 గంటలకు గంటవానిపల్లి వద్దకు చేరుకుని.. ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడతారు. అనంతరం మార్కాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం తర్లుపాడు రోడ్డులో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పర్యటనకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది.