Share News

తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:08 AM

తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ.. భావితరాలకు అందించేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి

  • సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

  • క్రీడలు, పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

  • సీఆర్‌డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ.. భావితరాలకు అందించేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 59వ సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ భవనాల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుల స్థాపనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే పర్యాటక ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టులో వాటర్‌ ఫ్రంట్‌, కల్చరల్‌ సెంటర్‌ తదితర విభాగాలు వస్తాయి. పర్యాటకంతోపాటు నిత్యం వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలి. హోటళ్లను ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో క్రీడారంగం అతి పెద్ద ఆదాయ వనరు కాబోతోంది. దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు నిధుల కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి నేడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా క్రికెట్‌ బోర్డులు ఎదిగాయి. ఇదేవిధంగా మరికొన్ని క్రీడలు కూడా కమర్షియల్‌గా టర్న్‌ అవుతాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి. అమరావతిలోని స్పోర్ట్స్‌ సిటీకి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను ఇదే విధంగా రూపొందించాం.


అమరావతిలోకి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టులను తీసుకురావాలి. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైబర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టలేకపోయినందుకు డీఎల్‌ఎఫ్‌ వంటి సంస్థలు ఇప్పుడు చింతిస్తున్నాయి. ఈసారి అమరావతిలో అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నాయి. ఇదీ మన ప్రభుత్వానికి ఉన్న క్రెడిబులిటీ. ఈ బ్రాండ్‌ మరింతగా పెరగాలి. అందుకే పెట్టుబడులు పెట్టేవారిని నిరంతరం ఫాలోఅప్‌ చేస్తూనే ఉండాలి. ఓ వైపు రాజధానిలో పనులను త్వరితగతిన చేపట్టేలా పర్యవేక్షణ చేస్తూనే.. మరోవైపు పెట్టుబడులు పెట్టే సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలి. అమరావతిలో నిర్మించబోతున్న తెలుగు కల్చరల్‌ సెంటర్‌కు మంచి పేరును పరిశీలించండి.’ అని సీఎం కోరారు.


పలు అంశాలకు సీఆర్‌డీఏ ఆమోదం..

  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపు

  • తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీకి పరిహారంగా 3 ఎకరాల కేటాయింపు

  • పంచాయతీరాజ్‌ విభాగంలోని ఏపీఎ్‌సఐఆర్డీకి 5 ఎకరాలు కేటాయింపు

  • రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆమోదం

  • ఏపీ సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణంలో రూ.2,316 కోట్లతో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ పనులకు పరిపాలన అనుమతులు

Updated Date - Mar 11 , 2026 | 06:42 AM