టెక్ బాటలో సాగుదాం
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:22 AM
‘రైతు కష్టం నాకు తెలుసు. ఓ మధ్యతరగతి రైతు బిడ్డగా చెబుతున్నా.. వ్యవసాయాన్ని లాభాల దిశగా నడిపించడానికి ఇక ‘అగ్రి టెక్’ దిశగా అడుగులు వేయబోతున్నాం.
లాభసాటి సాగుకు పంచసూత్రాలు: సీఎం
అగ్రి టెక్ విప్లవంలో ‘మై ఫామ్’ తొలి అడుగు
‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు
వరి సాగుతో అనుకున్నంత ఆదాయం లేదు
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
47 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ
ఏలూరులో 500 ఎకరాల్లో కోకో సిటీ
కృష్ణా జిల్లా సూరంపల్లిలో చంద్రబాబు వెల్లడి
46,85,838 మందికి ‘అన్నదాత’ సాయం
వారి ఖాతాల్లో రూ.2,675.97 కోట్లు జమ
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రపంచస్థాయి టెక్నాలజీ, నాలెడ్జ్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తూ.. పంటలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేందుకు మల్లవల్లిలో 500 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘రైతు కష్టం నాకు తెలుసు. ఓ మధ్యతరగతి రైతు బిడ్డగా చెబుతున్నా.. వ్యవసాయాన్ని లాభాల దిశగా నడిపించడానికి ఇక ‘అగ్రి టెక్’ దిశగా అడుగులు వేయబోతున్నాం. అగ్రి బిజినెస్‌మెన్ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటు చేస్తా. సాగును సమూలంగా కొత్త పుంతలు తొక్కించడానికి పంచసూత్రాలతో ముందుకు వెళ్తాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలోని మామిడి తోటల్లో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు రూ.2,675.97 కోట్లు విడుదల చేశారు. దీంతో ఈ ఏడాది మూడు విడతల్లో కలిపి రూ.8,985.41 కోట్లు జమ చేసినట్లయింది. అనంతరం రైతులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. సంక్షేమ పథకాలు చెప్పిన సమయానికి అందించాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ-పీఎమ్ కిసాన్ అనుసంధానం చేశామన్నారు. అగ్రిటెక్‌లో భాగంగా పూర్తి స్థాయిలో ఏఐ ఆగ్రోనమి్‌స్టలను తీసుకొస్తున్నామని చెప్పారు. ‘మై ఫామ్’ యాప్ తెచ్చామని.. అగ్రి టెక్ విప్లవంలో ఇది తొలి అడుగుగా పేర్కొన్నారు.

పంటలను ఫొటోలు తీయడం ద్వారా చీడపీడలు తెలుసుకోవడంతో పాటు వాటి నివారణకు ఏ విధంగా కృషి చేయాలన్నదానిపై ఈ యాప్ ద్వారా మరిన్ని సూచనలు అందుతాయన్నారు. తెలుగులో అడిగినా సమాధానాలు చెప్పే విధంగా తీర్చిదిద్దామని, రానున్న రోజుల్లో బహుభాషల్లో పనిచేసే విధంగా మార్చుతామని చెప్పారు. ఎరువుల వినియోగం, వాతావరణ ఆధారిత వ్యవసాయం, నీటిపారుదల సలహాలు, పంటలకు అనుగుణంగా డేటా ఆధారిత సలహాలు, డ్రోన్లు, వ్యవసాయ యంత్రాల సేవలతో అనుసంధానం వంటివి చేపడతామన్నారు. డ్రోన్‌తో పిచికారీ, ఏఐ ఆధారిత కీటక గుర్తింపు వంటి అనేక విధానాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వ్యవసాయం స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేసి లాభసాటిగా మార్చి వేసేందుకు పంచసూత్రాలు.. నీటి భద్రత.. డిమాండ్ ఆధారిత పంటలు.. అగ్రిటెక్.. ఫుడ్ ప్రాసెసింగ్... మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా దీనిని అమల్లోకి తెచ్చామని.. రానున్న రోజుల్లో సమగ్రంగా అమలు చేస్తామని తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
రబీలో వాడినా నీళ్లున్నాయ్..
గతంలో కృష్ణా జలాలు సవ్యంగా రాకపోవడంతో పండించిన పంటలు తుఫాన్ల బారిన పడేవి. అలాంటి పరిస్థితుల్లో నేడు తుఫాన్ కంటే ముందే పంటలు పండిస్తున్నారు. నీటి భద్రత ద్వారా ముందుకు పోతున్నాం. రిజర్వాయర్లు, చెరువుల్లో ఉన్న నీటిలో 65 శాతం ఖరీఫ్‌కు వాడాం. రబీలో వాడినా ఇప్పటికీ సమృద్ధి నీళ్లు అందుబాటులో ఉన్నాయంటే కూటమి ప్రభుత్వం ముందు చూపే కారణం. ఇకపై మే 15న నారుమళ్లు పోసుకుని వర్షపు నీటితోనే ఖరీఫ్ పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఖరీఫ్ నీటిని రబీలో కూడా వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా రానున్న రోజుల్లో 75 శాతం నీరు నిల్వ ఉంచుకోవచ్చు. ఈఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో నీటి లభ్యత తగ్గే వీలుంది.
అది అసమర్ధ ప్రభుత్వం..
జగన్ ఐదేళ్ల అసమర్థ పాలన వల్లే రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉంది. ఆదాయం సైతం తగ్గింది. మేం అధికారం చేపట్టిన 20 నెలల్లో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఇన్ని సమస్యలు పెట్టుకుని అన్ని వర్గాలకూ న్యాయం చేసిన ప్రభుత్వం మాది. ఇప్పటి వరకు 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి కేవలం 24 గంటల్లో రైతుల అకౌంట్‌లో డబ్బులు వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రూ.310 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చాం. రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాం. మామిడి రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే న్యాయం చేశాం.. మామిడి రైతుకు కర్ణాటక, తమిళనాడులో సాయం ఇవ్వలేదు. పొగాకుకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశాం. హెక్టారు ఉల్లి సాగు చేసిన రైతుకు రూ.50 వేలు ఇచ్చాం. కోకో పంటకు మద్దతు ధర కల్పించాం. ఈ కోకో పంట ఉత్పత్తులను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఏలూరులో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేస్తాం. ఈ (గన్నవరం) ప్రాంతంలో మామిడి కాయలకు కవర్లు కట్టి పండించడం చూస్తుంటే గర్వంగా ఉంది. డ్రోన్ పెట్టి విత్తనాలు చల్లుతున్నారు. కృష్ణా జిల్లాలో చేపలు, రొయ్యల సాగు సహా అన్నింటిలో ఆధునికత తీసుకొస్తున్నాం. ఆక్వా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. ఎన్ని కష్టాలు ఉన్నా యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే ఇస్తున్నాం. ఆక్వా కల్చర్‌కు రూ.810 కోట్లు రాయితీగా ఇచ్చాం. ఆధార్ ద్వారా ఈ-కేవైసీ తీసుకొచ్చాం. పశువుల కోసం గోధార్ తెచ్చాం. రాష్ట్రంలో డెయిరీ, పౌల్ర్టీ, ఆక్వా, హార్టికల్చర్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. వరి సాగుతో అనుకున్న ఆదాయం రావడం లేదు కనుక ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ) పెట్టి వ్యాపారవేత్తలను తయారు చేశాను. ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎ్‌సఏ) పేరుతో పెద్ద యూనివర్సిటీ పెడతా.
వ్యవసాయంపై యుద్ధాల ప్రభావం
యుద్ధాల ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగంపై పడుతోంది. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాయలసీమ అరటిపండ్లు ప్రధానంగా దుబాయి, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుత సంక్షోభంతో వాటి రవాణాకు సమస్యలు ఎదురవుతున్నాయి. కోడిగుడ్ల ఎగుమతులు కూడా కొంతవరకు నిలిచిపోయాయి. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సమస్య తలెత్తుతోంది. దీనిని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటుచేశాం.
ఒక వ్యక్తి తప్పు చేస్తే..
2014-19 నడుమ పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తి చేశాం. కానీ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చి పనులు సకాలంలో సాగకుండా నిర్వీర్యం చేసింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంత ప్రమాదమో డయాఫ్రం వాల్ నిదర్శనంగా మారింది.