Share News

శాఖలన్నిటిలో ఏఐ

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:29 AM

ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

శాఖలన్నిటిలో ఏఐ

  • పౌర సేవల సామర్థ్యం పెంచాలి.. డ్రోన్‌, సీసీటీవీ, శాటిలైట్‌ డేటాను సమీకృతం చేయాలి

  • సమస్యలపై అవగాహన కోసం కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే.. బస్టాండ్లలో పరిశుభ్రమైన తాగునీరు

  • బాణసంచా పరిశ్రమల్లో పేలుళ్లు జరక్కుండా చూడాలి

  • శివకాశీ తరహాలో రక్షణ చర్యలను ఇక్కడా చేపట్టాలి

  • కొత్త సమాచారం కోసమే సర్వేలు నిర్వహించాలి

  • ఈ నెల నుంచి సంతృప్త స్థాయి 80-90 శాతం తగ్గకుండా చూడాలి

  • అవినీతి మరకలేని వారికే రిజిస్ట్రార్లుగా బాధ్యతలు

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తద్వారా పౌరసేవల్లో సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. డ్రోన్‌, సీసీకెమెరా, శాటిలైట్‌ సమాచారాన్ని సమీకృతం చేసుకుని వినియోగించుకునే యంత్రాంగాన్ని అమల్లోకి తేవాలన్నారు. పౌర సమస్యలపై అవగాహన కోసం క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని మరోసారి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌, ప్రజల్లో సంతృప్త స్థాయిపై ప్రభుత్వ శాఖాధిపతులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు, పనితీరును మెరుగుపరచుకోవడానికి అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుండాలన్నారు. రాష్ట్రంలో ప్రమాదాలు, దుర్ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుడు ఘటనలు మళ్లీ జరక్కుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. తమిళనాడులోని శివకాశిలో అమలు చేస్తున్న భద్రత, రక్షణ చర్యలను రాష్ట్రంలోనూ కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.


‘ఆర్టీసీ బస్సులు బాగున్నా.. వేసవి రానున్న నేపథ్యంలో బస్‌స్టేషన్లలో సేవలు మెరుగుపరచాలి. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం పెంచాలి. మరుగుదొడ్లనూ మెరుగుపరచాలి. ప్రయాణికులకు పరిశుభ్రమైన తాగునీరందించాలి. వారు గమ్యస్థానాలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలి. పింఛన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తకుండా స్వర్ణ గ్రామాలు/స్వర్ణవార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం కాకుండా కొత్త సమాచారం కోసమే సర్వేలు నిర్వహించాలి. ఒకేరకమైన సమాచారం కోసం ప్రజలను పదేపదే ఇబ్బందికి గురి చేయొద్దు. ప్రభుత్వ సేవలను సమర్థంగా అందించాలి. జనంలో సంతృప్త స్థాయి ఈ నెల నుంచి కనీసం 80 శాతం నుంచి 90 తగ్గకుండా ఉండాలి. అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని 295 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి మరకలేని, నిజాయితీ కలిగిన అధికారులను నియమించాలి’ అని నిర్దేశించారు. వాట్సాప్‌ మనమిత్ర సేవలను మరింత విస్తృతం చేశామని, ప్రభుత్వ సేవలను 953కు పెంచామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

Updated Date - Mar 03 , 2026 | 05:37 AM