Share News

వేగం పెంచండి!

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:43 AM

రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న టాటా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ను కోరారు.

వేగం పెంచండి!

  • టాటా ప్రాజెక్టులపై ‘టాటా సన్స్‌’ చైర్మన్‌కు సీఎం వినతి

  • దావోస్‌లో చంద్రశేఖరన్‌తో మర్యాదపూర్వక భేటీ

  • వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న చైర్మన్‌

  • ఇన్నోవేషన్‌ హబ్‌ కార్యక్రమాల నిర్వహణకు

  • టాటా ట్రస్టు నుంచి అధికారులను పంపిస్తాం

  • టూరిజం ప్రాజెక్టులనూ వేగవంతం చేస్తాం

  • స్పోర్ట్స్‌ సిటీల్లో పెట్టుబడులకూ చంద్రశేఖరన్‌ సానుకూలత

  • గత ఏడాది దావోస్‌ పర్యటనతో ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయ్‌

  • తాజా పర్యటనతోనూ సత్ఫలితాలే: చంద్రబాబు

  • 4 రోజుల పర్యటన ముగించుకుని వెనక్కి

  • నేటి ఉదయం 10 గంటలకు అమరావతికి

  • 11 గంటల నుంచి సచివాలయంలో

  • అధికార కార్యక్రమాలకు హాజరు

అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న టాటా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ను కోరారు. దావోస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గురువారం ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. విశాఖలో టీసీఎస్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది. వీటిని వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చంద్రశేఖరన్‌ తెలిపారు. అలాగే రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణకు టాటా ట్రస్టు నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపిస్తామన్నారు. రాష్ట్రంలో టాటా గ్రూపు చేపట్టిన టూరిజం ప్రాజెక్టులనూ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్‌ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని.. ఈ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం కోరగా చంద్రశేఖరన్‌ సానుకూలత వ్యక్తం చేశారు. ఈ ఏడాది దావోస్‌ పర్యటన ఎలా సాగిందని చంద్రశేఖరన్‌ ప్రశ్నించగా.. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదికగా మారిందని.. ఏపీ బ్రాండింగ్‌కు, కొత్త పాలసీలపై మార్కెట్‌లో అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడిందని సీఎం బదులిచ్చారు.


గత ఏడాది దావోస్‌ పర్యటన ద్వారా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్‌ అయ్యాయని, తాజా పర్యటన కూడా మంచి ఫలితాలే ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్‌ ఎనర్జీ, కృత్రిమ మేధ (ఏఐ), వ్యవసాయం, పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలను.. వనరులను సమర్థంగా ప్రపంచ దేశాలకు వివరించగలిగామని, గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. యూర్‌పలోని తెలుగు ప్రజలతో మమేకం అవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.


4 రోజులు.. 36కుపైగా కార్యక్రమాలు..

నాలుగు రోజుల దావోస్‌ పర్యటన ముగించుకుని చంద్రబాబు స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. భారతకాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరారు. శుక్రవారం ఉదయం 8.25కి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10 గంటలకు అమరావతి చేరుకుని.. 11 గంటల నుంచి సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దావోస్‌ పర్యటనలో 36కుపైగా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌, యూఏఈ, స్విట్జర్లాండ్‌ దేశాల ప్రతినిధులతో మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆర్సెల్లార్‌ మిట్టల్‌ చైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌, ఐబీఎం సీఈవో అర్వింద్‌ కృష్ణ సహా 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన 9కిపైగా సెషన్స్‌, సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 05:50 AM