మీరెళ్తారా.. నన్ను వెళ్లమంటారా?
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:33 AM
‘మీరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తారా? లేక మీ బదులు నేను వెళ్లడం మొదలు పెట్టమంటారా?’ అని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు.
మీరు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తా
గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు
అధికారులైనా, నేతలైనా ఫీల్డుకెళ్లాల్సిందే
ప్రజలతో మాట్లాడినప్పుడే సమస్యలు తెలుస్తాయి
కల్తీ పాలు, డయేరియాలపై ఉదాసీనత వద్దు
బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలందించండి
ఘటన జరగక ముందే పర్యవేక్షణ ముఖ్యం: సీఎం
శ్రీకాకుళం, తూ.గో అధికారులతో సమీక్ష
అమరావతి/రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘మీరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తారా? లేక మీ బదులు నేను వెళ్లడం మొదలు పెట్టమంటారా?’ అని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. మీరు ఫీల్డుకు వెళ్లకుంటే.. తాను వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేయడం మొదలు పెడతానని స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా విస్మరించారని, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని వ్యాఖ్యానించారు. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా క్షేత్రస్థాయికి వెళ్లాలని.. ప్రజలను కలిసి మాట్లాడినప్పుడే సమస్యలు తెలుస్తాయని స్పష్టం చేశారు. అలాంటి పర్యటనల ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలోని తన చాంబర్ నుంచి శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. కల్తీ పాల ఘటనపై ఉదాసీనత వద్దని సూచించారు. రెండు ఘటనల్లో బాధితులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉండాలని, స్పెషలిస్ట్‌లతో అత్యుత్తమ వైద్య సేవలందించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనల్లో బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
24 గంటలూ క్యాంపు: శ్రీకాకుళం కలెక్టర్
డయేరియా ఘటనపై శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు 129 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 107 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, మిగతా వారు డిశ్చార్జి అయ్యారని చెప్పారు. ‘డయేరియా పరిస్థితిని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పైపుల ద్వారా నీటి సరఫరాను నిలుపుదల చేసి, ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నాం. ఇంజనీరింగ్ బృందాలు వివిధ చోట్ల 40 లీకులను గుర్తించి, మరమ్మతులు చేపట్టారు. సిబ్బంది, యంత్రాలతో పారిశుధ్య నిర్వహణ చేపట్టాం’ అని తెలిపారు. విశాఖ నుంచి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను శ్రీకాకుళానికి తరలిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని వివరించారు. రిమ్స్, కిమ్స్, శ్రీకాకుళం జెమ్స్‌లో ప్రత్యేక వార్డుల ద్వారా డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నామని, నెఫ్రాలజీ, ఇతర వైద్య నిపుణులను ఈ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామన్నారు. డయేరియా వ్యాప్తికి కారణంపై విచారణ చేస్తున్నామని, డోర్ టూ డోర్ సర్వే చేసి, శానిటేషన్ కిట్ అందజేస్తున్నామని చెప్పారు. స్థానికులు వాటర్ ట్యాంకులు క్లీన్ చేయకపోవడం, పైప్‌లైన్ల డ్రెయిన్లు క్రాస్ అవ్వడంతోపాటు వాటర్ ప్రెజర్ లేదని మోటార్లు పెట్టి నీటిని తీసుకోవడం వల్ల కలుషిత నీరు ఇళ్లకు చేరిందని అధికారులు తెలిపారు.
రోజూ పర్యవేక్షిస్తున్నాం: తూ.గో కలెక్టర్
రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన, బాధితులకు వైద్య సాయంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. ‘20 మంది కల్తీపాల కారణంగా అనారోగ్యం పాలవగా.. ఐదుగురు మృతిచెందారు. 15 మంది చికిత్స పొందుతున్నారు. కల్తీ పాల సరఫరా జరిగిన చౌడేశ్వరీ నగర్, స్వరూ్‌పనగ ర్‌లో 9 వైద్య బృందాలను నియమించాం. 110 ఇళ్లను సందర్శించి, 315 మంది రక్త నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నాం. కల్తీ పాలను తాగిన 957 మందిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందించాం. ఆయా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య బృందాలను అందుబాటులో ఉంచాం’ అని వివరించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా.రవిరాజు సూచనల మేరకు ఇతర ప్రాంతాల నుంచి యాంటీ డోస్ ఇంజక్షన్ రప్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనలో నిందితుడైన పాల సరఫరాదారు అడ్డాల గణేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ఇతర ప్రాంతాల నుంచి వైద్య పరికరాలతో పాటు నిపుణులైన డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేప్టీ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారని అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, నిమ్మల రామానాయుడుతోపాటు మున్సిపల్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, కల్తీ పాల బాధితులను మంత్రి కందుల దుర్గేశ్ గురువారం పరామర్శించారు.
అప్పుడే జవాబుదారీతనం పెరుగుతుంది..
ఘటన జరిగాక స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తత ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. కలెక్టర్లు, వివిధ విభాగాల్లోని జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే నివారించవచ్చన్నారు. ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసేందుకు, ఆయా విభాగాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. కలెక్టర్లు నిత్యం ప్రజల్లో ఉండాలని, అప్పుడే అనుకున్న మార్పును రాష్ట్రస్థాయిలో చూపించగలమన్నారు. శ్రీకాకుళం ఘటనలో ముందస్తు పర్యవేక్షణ, తనిఖీలు జరిగి ఉంటే.. సమస్య వచ్చేది కాదన్నారు. శుక్రవారం మరోసారి సమీక్ష చేస్తానని చెప్పారు.