Share News

ఆక్వా సాగును ఆదుకోండి

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:26 AM

రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమను, రైతులను ఆదుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు...

ఆక్వా సాగును ఆదుకోండి

  • రొయ్య మేత ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోండి

  • అమెరికా సుంకాలతో రైతులకు ఇబ్బందులు.. వాటిని తగ్గించేలా సంప్రదింపులు జరపండి

  • పొగాకు రైతులను ఆదుకోండి

  • హార్టీకల్చర్‌ హబ్‌కు నిధులివ్వండి

  • నిర్మలకు సీఎం చంద్రబాబు వినతి

అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమను, రైతులను ఆదుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, ఇది ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. రొయ్య మేత ధరలు భారీగా పెరిగిన కారణంగా ఉత్పత్తి వ్యయం 20 శాతం కంటే అధికమైందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ హెచ్చుతగ్గుల నుంచి ఈ రంగానికి రక్షణ కల్పించాలని , ఇందుకోసం ఓ సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని కోరారు. రూ. 100 కోట్ల కార్పస్‌ ఫండ్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రాన్‌ ప్రొడ్యూసర్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్‌ఎ్‌ఫడీబీ ద్వారా నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.


అమెరికా సుంకాలు తగ్గేలా చూడండి

అమెరికా అధ్యక్షుడి సుంకాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, రాష్ట్రంలోని 30 లక్షల మంది జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు ఎగుమతుల్లో సీఫుడ్‌పై ఉన్న 30 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని సున్నాకు తగ్గించాలని లేదా దానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను శ్లాబులో ఉంచడం వల్ల పొగాకు రైతులపై నేరుగా ప్రభావం పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం వివరించారు. ఈ ఏడాది 230 మిలియన్‌ కేజీల ఉత్పత్తికిగానూ కేవలం 34 మిలియన్‌ కేజీలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయన్నారు. తక్షణం పొగాకు రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ హార్టీకల్చర్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని కేంద్రమంత్రికి సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు 6-7 తేదీల్లో హార్టీకల్చర్‌ హబ్‌ పనులు ప్రారంభించనున్నామని, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్రమంత్రి నిర్మలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు.

ఆవిష్కరణల కేంద్రంగా ఐఎస్ఏ

రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్ఏ)ను రిలయన్స్‌ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటులో తోడ్పాటు అందించాలని కోరారు. ఆగస్టు 3న రిలయన్స్‌ గ్రూప్‌తో ఐఎస్ఏ ఏర్పాటుపై ఎంవోయూ కుదుర్చుకోనున్నామని తెలిపారు. విద్యాబోధనతో పాటు ఏపీ అగ్రికల్చరల్‌, ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ఓ మేధోమథన కేంద్రంగా, ఆవిష్కరణలకు ఇంజిన్‌గా ఐఎ్‌సఏ పని చేస్తుందని సీఎం వివరించారు.

Updated Date - Jul 18 , 2026 | 04:28 AM