రైతులను ఆదుకునేందుకు సహకరించండి కేంద్రమంత్రి చౌహాన్‌కు సీఎం చంద్రబాబు వినతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:34 AM
రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాలని, అర్హులైన పేదలకు గృహవసతి కల్పించేందుకు 6 లక్షల అదనపు ఇళ్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు.
ఖరీఫ్ దిగుబడిని 100 శాతం కొనుగోలుకు ముందస్తు అనుమతివ్వండి
పెండింగ్ నిధులు మంజూరు చేయండి
’హౌసింగ్ ఫర్ ఆల్’ లక్ష్య సాధనకు మరో 6 లక్షల ఇళ్లు అవసరం
కేంద్రమంత్రి చౌహాన్‌కు సీఎం చంద్రబాబు వినతి
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాలని, అర్హులైన పేదలకు గృహవసతి కల్పించేందుకు 6 లక్షల అదనపు ఇళ్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం వేర్వేరు వినతిపత్రాలు అందజేశారు. ఖరీ్‌ఫ-2026కి సంబంధించి పీఎం-ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, కొర్రలు, వేరుశనగ వంటి పంటల అంచనా దిగుబడిని 100 శాతం ఏపీమార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించి, తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి తప్పుతుందని కేంద్ర మంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు ఆధారంగా చేసిన మార్పులను ఎఫ్‌ఎ్‌ఫఎస్ యాప్‌లో చేర్చాలని, దీని వల్ల 2026-27 రబీ సీజన్ నాటికి ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయవచ్చని వివరించారు. ఆర్‌కేవీవై కిసాన్ డ్రోన్ కార్యక్రమానికి ఆమోదించిన రూ.52.16 కోట్ల పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిధులు అందితే రాష్ట్రంలోని 1,130 గ్రామాల్లో యంత్ర పరికరాల బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తవుతుందన్నారు. అలాగే 5.69 లక్షల మట్టి నమూనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.10.24 కోట్ల కమిటెడ్ లయబిలిటీ ఫండ్‌ను, 2026-27కు రావాల్సిన రూ.61.97 లక్షల మిగులు కేటాయింపులను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు.
ఇళ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం..
రాష్ట్రప్రభుత్వం నిర్దేశించుకున్న ’హౌసింగ్ ఫర్ ఆల్’ లక్ష్య సాధనకు కేంద్రం అందిస్తున్న సహకారానికి, 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత గృహ అవసరాలు తీరాలంటే మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. వాటిని మంజూరు చేస్తే.. నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ అంశాలపై వ్యక్తిగత చొరవ తీసుకుని, నిధుల విడుదలకు అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని లేఖలో కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.