రబీ మొక్కజొన్న కొనుగోలు చేయాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 05:28 AM
రాష్ట్రంలో 2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్న ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, రైతులకు ధర వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రైతులకు ధర వ్యత్యాసాన్ని చెల్లించాలి
ఏపీని ప్రత్యేకంగా పరిగణించాలి
100శాతం నిధుల్ని కేంద్రమే భరించాలి
పీఎం ఆషా పథకాన్ని జూన్ వరకు వర్తింపజేయాలి
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం లేఖ
అమరావతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్న ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, రైతులకు ధర వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఆందోళనలో ఉన్నారు. మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం క్వింటా మొక్కజొన్న ధర రూ.1,600-1,700 మధ్య ఉంది. కనీస మద్దతు ధర రూ.2,400 కన్నా చాలా తక్కువగా మార్కెట్ ధర ఉంది. రాష్ట్రంలో 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 14.26 లక్షల టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే.. రైతులు నష్టపోతారు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. పీఎం ఆషా కింద నేరుగా రైతులకు ధర వ్యత్యాసాన్ని చెల్లించాలి. ఏపీని ప్రత్యేకంగా పరిగణించి, ధర వ్యత్యాసంలో 100శాతం నిధులు కేంద్రమే భరించాలి. ఈ పథకాన్ని 2026 జూన్ వరకు పొడిగించాలి. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతివ్వాలి’ అని సీఎం లేఖలో పేర్కొన్నారు.