Share News

మొక్కజొన్న రైతును ఆదుకోండి

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:09 AM

మొక్కజొన్న పంటకు రాష్ట్రంలో ధర పడిపోయినందున మార్కెట్‌ జోక్యం పథకం(ఎంఐఎ్‌స)కింద ఏపీని ప్రత్యేక కేసుగా పరిగణించి, ధర లోటు చెల్లింపు(పీడీపీ)ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

మొక్కజొన్న రైతును ఆదుకోండి

  • ఏపీని ప్రత్యేక కేసుగా పరిగణించండి

  • ధర లోటు చెల్లింపును అమలు చేయండి

  • 100శాతం నష్టాన్ని కేంద్రం భరించాలి

  • జూన్‌ వరకు పీడీపీ వర్తింపజేయాలి

  • కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం లేఖ

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటకు రాష్ట్రంలో ధర పడిపోయినందున మార్కెట్‌ జోక్యం పథకం(ఎంఐఎ్‌స)కింద ఏపీని ప్రత్యేక కేసుగా పరిగణించి, ధర లోటు చెల్లింపు(పీడీపీ)ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు శుక్రవారం సీఎం లేఖ రాశారు. 2025-26 రబీ సీజన్‌లో రాష్ట్రంలో 4.83లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగవ్వగా, 37.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. అయితే మార్కెట్‌లో ధర పడిపోయినందున రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఏపీని ప్రత్యేక కేసుగా తీసుకుని, 50:50 నిష్పత్తికి బదులు 100శాతం నష్టాన్ని కేంద్రం భరించేలా చూడాలని సీఎం కోరారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ సమన్వయంతో మొక్కజొన్నకు ఎంఐఎస్‌ కింద ధర లోటు చెల్లింపు అమలు చేయడానికి నాఫెడ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిని ఈ ఏడాది జూన్‌ వరకు కొనసాగించాలన్నారు. ‘గతంతో పోల్చితే ఈ ఏడాది మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. అదనపు ఉత్పత్తి కారణంగా స్పాట్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ మందకొడిగా ఉంది. ప్రస్తుత ధర కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉంది. దిగుబడి గరిష్ఠంగా ఉండే కాలంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల ధరలను స్థిరీకరించడానికి, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి సకాలంలో జోక్యం చేసుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది’ అని సీఎం లేఖలో పేర్కొన్నారు. కాగా మొక్కజొన్న ధర పడిపోయి, రైతులు నష్టపోతున్న విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి, కేంద్రానికి లేఖ రాసినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు చెప్పారు.

Updated Date - Mar 28 , 2026 | 06:10 AM