భవిష్యత్ పోలీసింగ్‌కు బ్లూప్రింట్
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:35 AM
మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. టెక్నాలజీ అధారిత దర్యాప్తు, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ఫోరెన్సిక్ సామర్థ్యాల..
మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలి
టెక్ ఆధారిత దర్యాప్తు, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ఫోరెన్సిక్ సామర్థ్యాల పెంపు
తప్పుచేస్తే ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు: సీఎం
ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 ముగింపులో దిశానిర్దేశం
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. టెక్నాలజీ అధారిత దర్యాప్తు, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ఫోరెన్సిక్ సామర్థ్యాల పెంపు, ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్.. ఇవే భవిష్యత్ పోలీసింగ్‌కు మూల సూత్రాలని స్పష్టం చేశారు. విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఏపీ పోలీస్ రిట్రీట్- 2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీకి చెందినవారు తప్పుచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతిపక్షం బరితెగింపును అడ్డుకోకపోతే శాంతిభద్రతలను కాపాడలేమన్నారు.
ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్
గత రెండు దశాబ్దాల్లో నేరాల తీరు పూర్తిగా మారిపోయిందని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం, విద్వేషం, అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరిగాయని పేర్కొన్నారు. సంప్రదాయ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీ అధారిత పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, నేరస్థుల విషయంలో మాత్రం కఠినంగా ఉండాలని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరగడమే సమర్థ పోలీసింగ్‌కు కొలమానమని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలు
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు నేరాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాస్టర్ ప్రవీణ్ ఘటనపై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నాలుగైదు రోజులు పట్టిందన్నారు. ఇలాంటి ప్రచారాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పోలీసు వ్యవస్థ పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్ సవాళ్లకు సిద్ధమయ్యేలా పోలీస్ వ్యవస్థను సాంకేతికంగా, నిర్మాణాత్మకంగా, కార్యాచరణపరంగా సమూలంగా మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.