Share News

జలమే జీవం

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:59 AM

ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి భద్రతతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని అన్నారు.

జలమే జీవం

  • నీటి సంరక్షణపై 100 రోజుల ప్రణాళిక

  • నేటి నుంచి జూలై 14 దాకా కార్యక్రమం

  • సాగునీటి సంఘాలకు బాధ్యతలు

  • ప్రజల భాగస్వామ్యంతో నిర్వహణ

  • టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు దిశానిర్దేశం

  • నీటి సంరక్షణ బాధ్యత అందరిదీ

  • తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి

  • భూగర్భ జలాలు పెంచాలని సూచన

  • నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన

అమరావతి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి భద్రతతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని అన్నారు. జల సంరక్షణ ప్రధాన అజెండాగా రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల కార్యక్రమాలను చేపట్టాలని సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం చేశారు. దీనిని సోమవారం నుంచి జూలై 14వ తేదీ వరకూ సామాజిక ఉద్యమంలా నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ఆదివారం సాగునీటి వినియోగదారుల సంఘాలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60,000 మంది సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. జలవనరులు, అటవీ, పంచాయతీరాజ్‌, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘాలకు సీఎం పలు సూచనలు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 15వ తేదీ దాకా సాగునీటి భద్రతా కార్యక్రమాలను గుర్తించాలన్నారు. గుర్తించిన పనులకు16 నుంచి 20వ తేదీ వరకు పాలనామోదం పొందాలన్నారు. 21 నుంచి జూలై 9వ తేదీ దాకా పనులు చేపట్టాలని ఆదేశించారు. జూలై 10 నుంచి 14వ తేదీ దాకా పనుల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని సూచించారు. ఈ వంద రోజుల కార్యక్రమం అనంతరం వర్షాకాలం ప్రారంభమవుతుందని వివరించారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో గతంలో కంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు. నీటి భద్రత ఇవ్వగలిగితే రాష్ట్రమంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.


సమర్థంగా నీటి యాజమాన్య నిర్వహణ

తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు సూచించారు. వేసవికి ముందు ఆరు మీటర్ల లోతులో, వర్షాకాలం తర్వాత మూడు మీటర్ల లోతులోనే జలాలు అందుబాటులో ఉండేలా కార్యాచరణను అమలు చేయాలని స్పష్టం చేశారు. మైక్రో ఇరిగేషన్‌ను అమలు చేయాలని, ప్రతి చుక్కనూ సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7, 8 మీటర్ల లోతున భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ మట్టాన్ని ఒకటిన్నర మీటర్ల లోతులోనే అందుబాబులో ఉండేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. జలధార పేరుతో అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తున్న నీటి సంరక్షణ చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. భూగర్భ జలాలను పెద్దఎత్తున పెంపొందించారంటూ అధికారులను ప్రశంసించారు. ఫీడర్‌ చానళ్లను క్లియర్‌ చేయాలని, పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. అప్పుడే ఎక్కువ నీటిని సంరక్షించుకోగలమన్నారు. చెక్‌డ్యామ్‌లను అవసరమైన మేర మరమ్మతులు చేసుకోవాలన్నారు. సాగునీటి సంఘాలు వాటర్‌ బడ్జెట్‌ తయారు చేసుకోవాలని సూచించారు. సాగునీటి సంఘాల పరిధిలో నీటి లభ్యతను గుర్తించాలన్నారు. కొద్దిపాటి శ్రద్ధ పెడితే లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమేనని, ప్రజల భాగస్వామ్యంతో వందరోజుల నీటి సంరక్షణ ఉద్యమం జరగాలని సూచించారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంంలో చేపడుతున్నామని చెప్పారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్‌ హయాంలో శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు పోలవరం సహా పలు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీటిని ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. వర్షపు నీటిని సంరక్షిస్తున్నామని, 2024 మే నుంచి 2025 మే వరకూ 2.20 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు.


నేడు యాడికిలో చంద్రబాబు పర్యటన

సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అక్కడ సాగునీటి వినియోగదారుల సంఘాలు, రైతులతో సమావేశమవుతారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులతో మాటామంతీ నిర్వహిస్తారు. పంట కాలువ విస్తరణ ద్వారా ఆయకట్టుకు అందిస్తున్న జలాలు, సాగునీటి ప్రాంతాల్లో నీటి లభ్యత తదితర అంశాలపై మాట్లాడుతారు. సమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో రాష్ట్రవ్యాప్తంగా సాధించిన నీటి భద్రత, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భ జలాల మట్టాల పెరుగుదల వంటి అంశాలపై సీఎం మాట్లాడుతారు.

Updated Date - Apr 06 , 2026 | 05:52 AM