Share News

Nimmala Ramanaidu: జనవరి తొలి వారంలో వెలిగొండకు సీఎం

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:49 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఏడాది తొలి వారంలో వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు.

Nimmala Ramanaidu: జనవరి తొలి వారంలో వెలిగొండకు సీఎం

  • పోలవరం పనులు 18 నెలల్లో 13శాతం పూర్తి

  • నిర్వాసితులకు రూ.1,894 కోట్లిచ్చాం

  • ఆ ఐదేళ్లలో ప్రాజెక్టును జగన్‌ నాశనం చేశారు: నిమ్మల

అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఏడాది తొలి వారంలో వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్‌ పనుల ప్రగతిపై ఆయన ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. రూ.456 కోట్లతో చేపట్టే ఫీడర్‌ కెనాల్‌ పనులను ప్రారంభిస్తారన్నారు. ఇంకోవైపు.. పోలవరం ప్రాజెక్టు పనులను గత 18 నెలల్లో 13 శాతం పూర్తి చేశామని, ఇప్పటికి 87 శాతం పూర్తయిందని నిమ్మల వెల్లడించారు. పనులు శరవేగంగా చేస్తున్నా కళ్లున్న కబోధి, మాజీ సీఎం జగన్‌కు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విమర్శలు చూస్తుంటే.. దొంగే దొంగా దొంగా అని అరుస్తున్నట్లుగా ఉందన్నారు. ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో నిర్లక్ష్యం వహించడంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని, గైడ్‌బండ్‌ కుంగిపోయిందని, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ వచ్చిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును విధ్వంసానికి గురి చేసి.. ఇప్పుడు నిధులు వ్యయం చేయడం లేదంటూ తన పత్రికలో రాసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని.. డయాఫ్రం వాల్‌ పనులు 83 శాతానికి పైగా పూర్తయినట్లు చెప్పారు. నిర్వాసితులకు రూ.1,894 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. 2027 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని నిమ్మల స్పష్టంచేశారు.


పోలవరానికి మళ్లీ విదేశీ నిపుణులు

పోలవరం ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకుంటున్న సమయంలో వాటిని పరిశీలించడానికి విదేశీ నిపుణులు మరోసారి రానున్నారు. డేవిడ్‌ బి.పాల్‌, గియాస్‌ ఫ్రాంకో డి.సిస్కో (అమెరికా), రిచర్డ్‌ డొనెల్లీ, సీస్‌ హిన్స్‌బెర్జర్‌ (కెనడా) జనవరి 19వ తేదీన భారత్‌కు వస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి చేరుకునేవారు. ఈసారి నేరుగా ఢిల్లీలోనే దిగి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఉన్నతాధికారులతో కలసి కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుని.. అక్కడి నుంచి రాజమహేంద్రవరానికి పీపీఏతో కలిసి వస్తారు. ప్రాజెక్టు పరిధిలో 20 నుంచి 22 దాకా మూడు రోజుల పాటు ఉంటారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పురోగతి, నాణ్యతా ప్రమాణాలు, డిజైన్ల మేరకే పనులు పూర్తవుతున్నాయా.. నిపుణుల సూచన మేరకే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని వినియోగిస్తున్నారో లేదో స్వయంగా తెలుసుకుంటారు. గమనించిన అంశాలను తొలుత ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు, పీపీఏకి అక్కడే తెలియజేస్తారు. తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లి జల సంఘం, జలశక్తి శాఖ అధికారులతో భేటీ అవుతారు. పోలవరం పనుల తీరును కూలంకషంగా వివరిస్తూ నివేదిక సమర్పిస్తారు. ఇది దాదాపు తుది నివేదిక కావడంతో.. నిపుణుల పర్యటనను కేంద్రం, రాష్ట్రం రెండూ అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాయి.

Updated Date - Jan 01 , 2026 | 05:50 AM