భూ సమస్యలపై రంగంలోకి సీఎం
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:21 AM
భూముల రీసర్వే 2.0 ఎలా జరుగుతోంది.. రైతుల అభ్యర్థనలను అధికారులు పరిశీలిస్తున్నారా.. వారికి నోటీసులిచ్చాకే భూములు కొలతలు వేస్తున్నారా.. వివాదాల పరిష్కారం ఎలా ఉంటోంది..
క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలన
నేడు సిద్ధాంతంలో రైతులతో ముఖాముఖి
రీసర్వే 1.0 సమస్యల పరిష్కారంపై ఆరా
పొలాల్లోకి వెళ్లి వారితో చర్చలు
వెంట ఉండేది సర్వేయర్, వీఆర్వో మాత్రమే
1936 మందికి కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ
వీరిలో 54 మంది ఇనామ్ సర్వీస్ రైతులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భూముల రీసర్వే 2.0 ఎలా జరుగుతోంది.. రైతుల అభ్యర్థనలను అధికారులు పరిశీలిస్తున్నారా.. వారికి నోటీసులిచ్చాకే భూములు కొలతలు వేస్తున్నారా.. వివాదాల పరిష్కారం ఎలా ఉంటోంది.. రైతుల మనోగతం ఏమిటి.. ఈ ప్రశ్నలకు వాస్తవిక సమాధానాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వాసవీ పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామాన్ని సందర్శించనున్నారు. భూ సమస్యల పరిష్కారం.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, రెవెన్యూ అంశాలపై క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలిస్తారు. పనిలోపనిగా తొలి విడత రీసర్వేకు సంబంధించి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు కూడా పంపిణీ చేస్తారు. జగన్ హయాంలో 6,675 గ్రామాల్లో రీసర్వే జరిగితే రైతులకు అనేకానేక సమస్యలు ఎదురయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ గ్రామాల్లో సభలు నిర్వహించగా.. 8.75 లక్షల మంది ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ఇనామ్ రైత్వారీ పట్టాలున్న రైతులకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. రెవెన్యూ అధికారులు రికార్డులు, వెబ్‌ల్యాండ్ డేటా పరిశీలన చేయకుండానే.. రైత్వారీ పట్టాలున్న భూములను కూడా సర్వీసు ఇనామ్‌గా రీసర్వే రికార్డుల్లో నమోదు చేశారు. అనంతరం ఆ రైతులకు ఇనామ్(సర్వీసు) భూములుగా పట్టాలు ఇచ్చారు. ఇది పూర్తిగా అధికారులు చేసిన తప్పేనని నిర్ధారణ అయుంది. సిద్ధాంతం గ్రామంలోనూ 54 మంది ఇనామ్ రైతులు ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడీ సమస్యను రెవెన్యూ శాఖ పరిష్కరించింది. రీసర్వే 1.0లోని లోపాలను సరిదిద్ది రికార్డులను సవరించింది.
రైత్వారీ పట్టాలున్న రైతుల భూమి రికార్డుల్లో సర్వీసు ఇనామ్ అనే పదం తొలగించారు. వాటిని రైత్వారీ పట్టాలుగానే పరిగణించాలని, గ్రామ రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేరిటే రికార్డును పొందుపరిచారు. ఇలాంటి సమస్యలు అనేక గ్రామాల్లో ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో సమస్యలకు రెవెన్యూ యంత్రాంగం సరైన పరిష్కారం చూపిస్తోందో లేదో సీఎం ప్రత్యక్షంగా సిద్ధాంతంలో తెలుసుకోన్నారు. పొలాల వద్దకు వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడతారు. ఆయన వెంట గ్రామ సర్వేయర్, వీఆర్వో మాత్రమే ఉంటారు. వచ్చే ఏడాది మార్చి నాటికి భూముల రీ సర్వే 2.0 పూర్తిచేయాలని సీఎం రెవెన్యూ శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయిలో తాను ఆశించిన పురోగతి, మార్పు ఎలా ఉందో ఆయన సిద్ధాంతంలో పరిశీలిస్తారు.
ఇనామ్ రైత్వారీ పట్టాల పంపిణీ..
సిద్ధాంతం గ్రామంలో 1936 మంది రైతులకు ముఖ్యమంత్రి నూతన పట్టాదార్ పాస్‌పుస్తకాలను అందించనున్నారు. ఇందులో ఇనామ్ రైత్వారీ పట్టాలున్న రైతులు 54 మంది ఉన్నారు. ఈ రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన రికార్డుల్లో సర్వీసు ఇనామ్ అని ఉంది. ఆ పేరిటే పాస్‌పుస్తకాలు ఇచ్చారు. దీని వల్ల మూడేళ్లపాటు ఆ భూములపై లావాదేవీలు జరగలేదు. వాస్తవానికి ఆ భూములు ఎప్పుడో రైత్వారీ పట్టాలుగా మారాయి. రీ సర్వే 1.0లో వచ్చిన తప్పులను అధికారులు సరిదిద్దారు. రికార్డుల్లో రైతుల పేర్లే నమోదుచేశారు. ఇనామ్ సర్వీసు అన్న పదం తొలగించి.. ఇనామ్ రైత్వారీ పట్టాగా నమోదు చేసినట్లు తెలిసింది. రాజముద్రతో ఉన్న ఆ కొత్త పాస్‌పుస్తకాలను రైతులకు సీఎం అందిస్తారు.
సీఎం పర్యటన ఇలా..
వాసవీ పెనుగొండ, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): గ్రామసభ నిర్వహణ ఏర్పాట్ల కోసం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మీ, ఇతర అధికారులు ఆదివారం ఉదయమే సిద్ధాంతం వెళ్లారు. గ్రామం లో ఉన్న మొత్తం భూమి, సర్వే నంబ ర్లు, రీ సర్వే జరిగిన తీరు, అందులో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర అధికారులతో సీసీఎల్‌ఏ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనలో సోమవారం ఉదయం 11.15 గంటలకు గ్రామసభ ఉంటుంది. ‘మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 1.20 వరకు అక్కడే ఉంటారు. రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అందజేస్తారు. అనంతరం 2.30 గంటలకు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్తారు. పొలాల్లో రైతులతో ముఖాముఖి చర్చిస్తారు. చివరిగా టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.
సత్యనారాయణగారూ.. సిద్ధాంతంలో కలుద్దాం!
90 ఏళ్ల వృద్ధుడి కోరికపై చంద్రబాబు స్పందన
వాసవీ పెనుగొండ మండలం రామన్నపాలెం శివారు కామధేనువు లంకకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరాభిమాని. సోమవారం సీఎం సిద్ధాంతం వస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘ఆ మహానుభావుడిని దూరం నుంచి చంద్రబాబు గారూ అని మొక్కుతా.. ఆయన రెండు చేతులూ ఊపుతారు. అది చాలు’ అని అన్నారు. జనాలు బాగా ఉంటారని స్థానికులు చెప్పడంతో.. ‘తప్పుకొంటూ ముందుకెళ్తాం.. అక్కడి నుంచే చంద్రబాబు గారూ అంటాను. ఆయన చేయి ఊపుతారు. కాశీ వెళ్లి గంగను తాకలేం.. కాలికాడికి వచ్చిన గంగను తాకలేమా’ అని సత్యనారాయణ బదులిచ్చారు. ఈ మాటలను ఆయన మనవడు రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చంద్రబాబు పాలనపై ఆయన నిష్కల్మషంగా మాట్లాడిన మాటలు సీఎం హృదయాన్ని తాకాయి. దీనిపై ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. ‘సిద్ధాంతం వస్తున్నా.. కలుద్దాం’ అని సమాధానమిచ్చారు. దీంతో సత్యనారాయణ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారా.. ఎప్పుడు కలుద్దామా అని తహతహలాడుతున్నారు.