క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో తొలి అడుగు
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:09 AM
సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మరికొన్ని గంటల్లోనే తొలి అడుగు పడనుంది.
ఈ నెల 6 లేదా 7న శంకుస్థాపన
హాజరు కానున్న సీఎం చంద్రబాబు
గుంటూరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మరికొన్ని గంటల్లోనే తొలి అడుగు పడనుంది. ఇటీవలే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా ఖరారు కాగా.. ఆ భవనానికి ఈ నెల 6 లేదా 7న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఉద్ధండ్రాయునిపాలెంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించాలని భావించారు. అయితే నేలపాడులో గురువారం సాగునీటి వినియోగదారుల రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుండటం.. వారం వ్యవధిలో ఆరు కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సి ఉండటంతో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారానికి మార్చాలని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అయితే తుది నిర్ణయాన్ని బుధవారం తెలియజేస్తామని సీఎంవో అధికారులు వెల్లడించారు.
మూడు దశల్లో అభివృద్ధి..
అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో భారత్‌లోనూ అందునా ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దీనిపై కేంద్రంతో చర్చలు జరిపి ఒక ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మొత్తం మూడు దశల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గతేడాది జూలైలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వర్కుషాప్ కూడా నిర్వహించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అలాగే.. 2027 జనవరి 1 నాటికి మూడు క్వాంటమ్ కంప్యూటర్లను ఇన్‌స్టాల్ చేయాలని, 2028 జనవరి 1 నాటికి 1,000 నూతన క్వాంటమ్ ఆల్గారిథమ్స్‌ను టెస్టింగ్ చేసే సామర్థ్యానికి చేరుకోవాలని, 2029 జనవరి 1 నాటికి మొత్తం క్వాంటమ్ సామర్థ్యంలో వెయ్యి ప్రభావిత క్యూబిట్స్ లక్ష్యానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో అమరావతి రాజధాని టెక్నాలజీ పరంగా ఉన్నత స్థానంలో నిలుస్తుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్వాంటమ్ ప్రోగ్రామ్‌కు లక్ష మంది నమోదు
ఉన్నత విద్యామండలి చైర్మన్
నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) నిర్వహిస్తున్న క్వాంటమ్ ప్రోగ్రామ్ కోసం రాష్ట్రంలోని 1,04,070 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని ఉన్నత విద్యామండలి మంగళవారం రాత్రి తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఇదొక రికార్డు అని పేర్కొంది. క్వాంటమ్ టెక్నాలజీని విద్యార్థులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగాలు రాబోయే కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు.