మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన రేపే!
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:06 AM
రాష్ట్రాభివృద్ధికి కీలకం కానున్న మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా...
భూమి పూజకు హాజరుకానున్న సీఎం
రూ.1,47,162 కోట్ల పెట్టుబడి..
65 వేల మందికి ఉపాధి అవకాశాలు
నక్కపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధికి కీలకం కానున్న మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామం వద్ద విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన సభా వేదికను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
2029 నాటికి ఉత్పత్తి ప్రారంభం
ప్రపంచం దిగ్గజ కంపెనీలైన యూర్‌పలోని లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు (ఏఎంఎన్‌ఎస్) భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనులు చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. 2033 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 వేల నుంచి 65 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దాదాపు 2,164 ఎకరాల్లో ఈ భారీ ఉక్కు పరిశ్రమను నిర్మించనున్నారు. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించిన భూములను స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయించింది. బుచ్చిరాజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డీఎల్ పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు కేటాయించారు.