Share News

సాగునీటి సదస్సు నేడే

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:13 AM

జగన్‌ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ కోసం నయాపైసా కూడా విడుదల చేయలేదు.

సాగునీటి సదస్సు నేడే

  • సంఘాల అధ్యక్షులతో సీఎం సమావేశం

  • అమరావతి పెరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు

  • 6,047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు,267 డిస్ట్రిబ్యూటరీ కమిటీల చైర్మన్ల హాజరు

  • యాజమాన్య విధానాలపై సీఎం కీలక ప్రకటన!

  • లస్కర్‌ వ్యవస్థపైనా చేసే అవకాశం

అమరావతి/తుళ్లూరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ కోసం నయాపైసా కూడా విడుదల చేయలేదు. ఫలితంగా అన్నమయ్య, పింఛ, బుడమేరు, పులిచింతల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 6,047 సాగునీటి వినియోగ యాజమాన్య సంఘాల అధ్యక్షులు, 58 ప్రాజెక్టు కమిటీల అధ్యక్షులు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లతో.. గురువారం అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల నుంచి హైకోర్టుకు వెళ్లే మార్గంలో ఉన్న పెరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాగునీటి యాజమాన్య విధానాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలోనే ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణపై సీఎం కీలక ప్రకటన చేసే వీలుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగునీటి సంఘాల ద్వారా ఇప్పటికే రూ.10 లక్షల దాకా నామినేషన్‌ విధానంపై అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. ఈ సంఘాల చైర్మన్లను పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ వినిపిస్తోంది. దీనితోపాటు లస్కర్‌ వ్యవస్థపైనా చంద్రబాబు ప్రకటన చేస్తారని సాగునీటి సంఘాల చైర్మన్లు ఆశిస్తున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను గుంటూరు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జేసీ అశుతోష్‌ శ్రీవ్రాస్తవ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, డీఎస్పీ మురళీకృష్ణ, సీఆర్‌డీఏ అధికారులు బుధవారం పరిశీలించారు.

Updated Date - Feb 05 , 2026 | 04:14 AM